హైదరాబాద్ జూన్ 6 (నమస్తేతెలంగాణ): నిన్న ఐదు గంటలపాటు రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ నిర్వహించి చర్చించింది ఏమిటి? తీసుకున్న నిర్ణయాలేమిటి? అని ముఖ్యమంత్రి, మంత్రులను శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి నిలదీశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల ఊసే ఎత్తకుండా రాష్ట్ర ప్రజల ఆశలపై సర్కారు నీళ్లు చల్లిందని దుయ్యబట్టారు. నాడు ఓట్ల కోసం ఆడబిడ్డలు, ఆటోడ్రైవర్లను, కార్మికులను, కర్షకులను, కూలీలను మభ్యపెట్టి ఓట్లేయించుకొన్న కాంగ్రెస్.. గద్దెనెక్కిన తర్వాత మొండిచెయ్యి చూపుతున్నదని నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలను అటకెక్కించి కమీషన్ల పేరిట చీకటిరాజ్యం నడుపుతున్నదని విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, పల్లె రవికుమార్, బీఆర్ఎస్ నేతలు మన్నె గోవర్ధన్, దిలీప్రెడ్డితో కలిసి మధుసూదనాచారి మీడియాతో మాట్లాడారు. ఏడాదిన్నరలో రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు ఇవ్వాల్సిన రైతుంబంధు నిధులను ఒక్కసారే ఇచ్చి అన్నదాతను దగా చేసిందని విమర్శించారు. ‘సీఎం, మంత్రుల మాటలు కోటలు దాటుతుంటే కాలు మాత్రం కడప దాటడంలేదు.. 18 నెలల్లో అభివృద్ధి కుంటుపడింది.. సంక్షేమం ఆగమైంది.. వెరసి రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నది’ అని దుయ్యబట్టారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కేసీఆర్ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తే.. రేవంత్ సర్కారు ఏడాదిన్నర పాలనలో అన్ని రంగాలను దెబ్బతీసి సర్వనాశనం చేస్తున్నది’ అని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌కు పగుళ్లు వస్తే రిపేర్లు కూడా చేయించలేని అసమర్థ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. కోతికి పుండు పుట్టినట్టు చిన్న సమస్యను పెద్దదిగా చేస్తున్నదని మండిపడ్డారు.
ఇంతటి స్వల్పకాలంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం దేశంలో మరొకటి లేదని విమర్శించారు. తెలంగాణ జాతి చైతన్యాన్ని తక్కువగా అంచనా వే యొద్దని రేవంత్ ప్రభుత్వానికి హితవు పలికారు. నాటి సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం దాకా నరనరాన చైతాన్యానికి నింపుకొన్న నేల ఇది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. లేదంటే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పీఆర్సీ ఊసెత్తకుండా ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశకు గురిచేసి దగా చేసింది..అని ఉద్యోగ సంఘాల మాజీ నేత దేవీప్రసాద్ విమర్శించారు. గుట్టను తవ్వి గులకరాయి కూడా తీయలేదని ఎద్దేవా చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ వేసి, మంత్రుల కమిటీని, అధికారుల కమిటీని వేసి చర్చోపచర్చలు చేసి సాధించిందేమిటని నిలదీశారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల్లో రెండు మాత్రమే ఇస్తామని, అందులో ఒకటి ఆరు నెలల తర్వాత విడుదల చేస్తామని ప్రకటించడం చూస్తుంటే ఉద్యోగుల సంక్షేమంపై కాంగ్రెస్ సర్కారుకున్న చిత్తశుద్ధిలేమి వెల్లడైందని చెప్పారు. రూ.11 వేల కోట్ల ఉద్యోగుల బకాయిలను ప్రతినెలా రూ.700 కోట్ల చొప్పున ఇస్తామనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. గతంలో రూ.500 కోట్లు ఇస్తామని ఎగ్గొట్టిన చరిత్ర రేవంత్‌రెడ్డి సర్కారు సొంతమని ఆరోపించారు. మూడు విడుతల్లో విడుదల చేయాలని, ఉద్యోగ సంఘాలను పిలిచి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
‘క్యాబినెట్ మీటింగ్‌లో గోదావరి-బనకచర్ల లింక్‌పై ఎందుకు చర్చించలేదు? ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు కూడబలుక్కొని వరద జలాల ముసుగులో గోదావరిని చెరబట్టేందుకు కుట్రలు చేస్తుంటే రేవంత్ సర్కారు ఏం చేస్తున్నది?’ అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ ప్రశ్నలను సంధించారు. ‘ఉమ్మడి పాలనలో కృష్ణా జలాలను దోపిడీ చేసిన తరహాలోనే ఇప్పుడు చంద్రబాబు గోదావరిలోని 200 టీఎంసీలను తరలించుకుపోయేందుకు యత్నిస్తున్నారు.. ఇందుకు నిధులిచ్చి, రుణ పరిమితి మినహాయింపు ఇచ్చి ప్రధాని మోదీ సహకరిస్తున్నారు.. రేవంత్ వీరిద్దరికీ వంతపాడుతు న్నారు.. అని ధ్వజమెత్తారు. తన గురువు కోసమే మన ముఖ్యమంత్రి కాళేశ్వరంలోని మేడిగడ్డను పునరుద్ధరించడమే లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల డ్రామాలను బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోదని తేల్చిచెప్పారు. పోరాటానికి వెనుకాడబోమని హెచ్చరించారు.