హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఇచ్చిన హామీలకు, బడ్జెట్లో కేటాయింపులకు పొంతనలేదని శాసనమండలిలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. గతం కంటే భిన్నంగా అద్భుత పాలన అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అప్పులు అంటూ గగ్గోలు పెడుతున్నదని మండిపడ్డారు. శనివారం మండలిలో 2024-25 బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం హామీలను అమలుచేస్తామని ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రకటించారని, సంకల్పం, అవగాహన ఉంటే ఇంత కాలయాపన ఎందుకు అవుతుంది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ 60 ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రాంతం ఎటువంటి అవమానానికి, అన్యాయానికి, విధ్వంసానికి గురైందో తెలంగాణ ప్రజలకు తెలుసు అని అన్నారు.
తెలంగాణపై అక్కసును వెల్లగక్కితే కేసీఆర్ ఉద్యమాన్ని నిర్మించి రాష్ర్టాన్ని సాధించారని గుర్తుచేశారు. తెలంగాణ సాధించేనాటికి రాష్ట్రంలో సాగునీరు లేదు.. తాగునీరు లేదు.. కరెంటు లేదు.. మెరుగైన వైద్యం లేదు అని తెలిపారు. ‘స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరిగింది. మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఆదర్శ గ్రామాలు ఏర్పడ్డాయి. శాంతిభద్రతల నిర్వహణ అద్భుతం. పెట్టుబడులు తరలివచ్చాయి. నిరంతర విద్యుత్తు సరఫరా, ఇంటింటికీ తాగునీరు, పచ్చదనం పెంపు, వ్యవసాయంలో తెలంగాణ నంబర్ వన్ అయ్యింది. కేసీఆర్ చేసిన అభివృద్ధి చూస్తే మనసు ఉప్పొంగుతుంది. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. దేశానికి తెలంగాణ రోల్‌మాడల్‌గా నిలిచింది’ అని వివరించారు.
‘కల్యాణలక్ష్మి పథకం వెనుక ఒక నేపథ్యం ఉన్నది. వరంగల్ జిల్లా భాగ్యతండలో సంభవించిన ఘటన నేపథ్యం నుంచి వచ్చిందే ఈ పథకం. మొదట రూ.50 వేల నుంచి ప్రారంభమై.. రూ.లక్షకు పెరిగింది. వృద్ధులు, మహిళలు, బీడీ కార్మికులు, డయాలసిస్, ఒంటరి మహిళలకు రూ.200 ఉన్న పింఛను రూ.1,000కి, ఆ తర్వాత రూ.2 వేలకు పెరిగింది. ఈ ప్రభుత్వం రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చినా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. పేదలను ఆదుకోవాలని అనేక సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ అమలు చేశారు. ఇలాంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేదు. డైరెక్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్స్ నివేదికే తెలంగాణ ప్రగతిని నిదర్శనం.
అద్భుతాలు చేసి గత ప్రభుత్వాన్ని అభినందించుకండా, ఏమీ జరగనట్టు చిత్రీకరించటం మంచిది కాదు’ అని కాంగ్రెస్ సర్కారుకు మధుసూదనాచారి చురక అంటించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు ఎకరానికి సంవత్సరానికి రూ.15 వేల పంట పెట్టుబడి ఇస్తామని, కౌలు రైతులకు రైతు భరోసా సాయం ఇవ్వడానికి మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని చెప్పినట్టు మధుసూదనాచారి గుర్తుచేశారు. మార్గదర్శకాలకే 4 నెలలు పడితే.. సాగదీస్తూ ఎగనామం పెడతారా? అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్, మహిళలకు రూ.2,500, యువ వికాసం కింద రూ.5 లక్షల భరోసా కార్డు, చేయూత కార్డు, ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ అని నిలదీశారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించటం మంచి నిర్ణయమని, దీనికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని మధుసూదనాచారి అన్నారు. అలాంటి ప్రాజెక్టుకు అంత తక్కువ కేటాయింపు ఏమిటని ప్రశ్నించారు. వైద్యరంగం, బీసీల సంక్షేమానికీ సరైన కేటాయింపులు లేవని వెల్లడించారు. ‘యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని అన్నారు. వాటికి నిధుల కేటాయింపే లేదు. సింగరేణి కార్మికులు, సీనియర్ సిటిజన్స్, మాజీ సైనికులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, గల్ఫ్కార్మికులు, దివ్యాంగులు, క్రీడాకారులు, ట్రాన్స్‌జెండర్స్, పర్యాటక రంగం, జానపద సాంసృతిక రంగం, కార్మిక రంగాలకు ఎలాంటి కేటాయింపులు లేవని పేర్కొన్నారు.