హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ జీరో చేసే వరకు పోరాటం కొనసాగుతుందని టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ ఎల్ రమణ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చేనేతపై 5 శాతం ఉన్న జీఎస్టీని కొంతకాలం యథావిధిగా కొనసాగిస్తామని కేంద్రం ప్రకటించడాన్ని తప్పుపట్టారు. అఖిల భారత పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో 4 రోజులుగా పలు రాష్ట్రాల్లో పోరాటాలు చేస్తున్నారని, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు జీఎస్టీ కౌన్సిల్‌కు జీఎస్టీ తొలగించాలని లేఖలు రాశారని పేర్కొన్నారు. జీఎస్టీనీ 12 శాతానికి తీసుకు రావడంపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో కేంద్రం దీనిని తాత్కాలికంగా వాయిదా వేసిందన్నారు.
వస్త్రపరిశ్రమపై జీఎస్టీని సున్నా చేసే వరకు పోరాడుతామని టీఆర్ఎస్ నాయకుడు కర్నాటి విద్యాసాగర్ తెలిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామన్నారు. చేనేత వస్ర్తాలపై జీఎస్టీని మొత్తం రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. చేనేతపై పెంచిన జీఎస్టీ అమలును తాత్కాలికంగా నిలుపుదల చేయడంపై తెలంగాణ పద్మశాలీ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (టీపోపా) హర్షం వ్యక్తంచేసింది.
వస్త్ర పరిశ్రమపై అదనంగా 7శాతం జీఎస్టీ విధించాలనే నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకున్న కేంద్రం.. ఆ పరిశ్రమపై ఇప్పటికే ఉన్న 5 శాతం జీఎస్టీనీ రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గత పాలకులు చేనేత రంగంపై ఎలాంటి పన్నులు విధించలేదన్నారు. కానీ, బీజేపీ అధికారంలోకి రాగానే ఈ పరిశ్రమను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి 5శాతం పన్ను విధిస్తుందని తెలిపారు. తక్షణమే వస్త్ర, చేనేత ఉత్పత్తులపై మొత్తం జీఎస్టీని ఎత్తేసి ఆ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న కార్మికులు, కర్షకులను కాపాడాలని కోరారు. ఇందుకోసం జనవరి మొదటివారంలో ఆ రంగంలోని అసోసియేషన్లు నిర్వహించే ఆందోళనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.