హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పీఆర్టీయూ టీఎస్ పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నారాయణగూడలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన పీఆర్టీయూ 52వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు పింఛన్, గ్రామీణ ప్రాంతాల వారికి హెచ్ఆర్ఏ, ప్రసూతి సెలవులు, 010 పద్దు ద్వారా వేతనాలు, పలు పోస్టుల మంజూరు, 30 శాతం పీఆర్సీ, ఉద్యోగుల వయోపరిమితి 61 ఏండ్లకు పెంపు వంటి చారిత్రక విజయాలను పీఆర్టీయూ సాధించిందని అభినందించారు.
రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ముందుగా, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర మాజీ ప్రధానకార్యదర్శి ద్వాప నరసింహారెడ్డిని, పత్రిక మాజీ సంపాదకుడు మాలె సంజీవరెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, తిరుపతిరెడ్డి, గోవర్ధన్ యాదవ్, మహేందర్‌రెడ్డి, ఇన్నారెడ్డి, కృష్ణారెడ్డి, రాఘవరెడ్డి, విద్యాసాగర్, కృష్ణమూర్తి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.