హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. జీపీఎఫ్, టీఎస్ జీఎల్ఐ, సరెండర్ లీవు, మెడికల్ బిల్లులు, పెండింగ్ డీఏ, పీఆర్సీ బకాయిలను వెంటనే ఉపాధ్యాయుల ఖాతాల్లో జమచేయాలని విజ్ఞప్తిచేశారు. శుక్రవారం హైదరాబాద్ నారాయణగూడలోని పీఆర్టీయూ టీఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కూర రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఏకైక సంఘం పీఆర్టీయూ టీఎస్ అని పేర్కొన్నారు.
తొలి పీఆర్సీలో 30 శాతం ఫిట్మెంట్ సాధించామని, రెండో పీఆర్సీలోనూ మంచి ఫిట్మెంట్ తెచ్చుకొంటామని ధీమా వ్యక్తం చేశారు. కోర్టు అడ్డంకులను అధిగమించి టీచర్ల బదిలీలు, పదోన్నతులు కొనసాగించడమే కాకుండా, సర్వీస్‌రూల్స్‌ను కూడా సాధిస్తామని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీలు పూల రవీందర్, బీ మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, మాజీ ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి, తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి, చిత్తలూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.