నల్లగొండ, జనవరి 8 : కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను పక్కన పెట్టి నిత్యం రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ నేతలపై కేసులు(Illegal cases) పెట్టిస్తూ కక్ష పూరితంగా ప్రవర్తిస్తున్నదని ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి(MLC Kotireddy) అన్నారు. నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడాది దాటినా ఇంకా రుణమాఫీ పూర్తి చేయలేదని, ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఆ ప్రజల కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చాలేగానీ నిత్యం కుట్రపూరితంగా బీఆర్ఎస్ వారిపై కేసులు పెట్టాలనే ఆలోచనతో ముందుకెళ్లడం సరికాదని హితవు పలికారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాడు. తాను జైలుకు వెళ్లినట్లుగానే కక్షతో అందరినీ జైలుకు పంపాలని కుట్ర పూరితంగా ఆలోచిస్తున్నాడని విమర్శించారు.అలాంటి క్రిమినల్‌కు అధికారం ఇవ్వడమే సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కోలేక వారి దృష్టి మళ్లించటానికి ఈ కేసుల కుట్రలు జరుగుతున్నట్లు తెలిపారు. ఎన్ని కుట్రలు చేసి కేసులు పెట్టినా వాటిని ఎదుర్కొనే శక్తి బీఆర్ఎస్కు ఉందని, ఉద్యమంలోనే జైలుకు వెళ్లి వచ్చిన తమ నేతలకు కేసులు కొత్త కాదని చెప్పారు. ఇంకా కాంగ్రెస్ పద్ధతి మారకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.