కామారెడ్డి, ఫిబ్రవరి 16: కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సోమవారం నిర్వహించారు. చైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థిని ఇప్ప ఉమారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా కాసర్ల గోదావరి ఎన్నికయ్యారు. కామారెడ్డికి చెందిన కాసర్ల గోదావరి ఇంటర్ వరకు చదివారు. పుస్తకాలు చదవడం, పాటల వినడం, కల్చరల్ ప్రోగ్రాముల్లో పాల్గొనే వారు. 2018లో బీఆర్ఎస్లో చేరి రాజకీయ ప్రవేశం చేశారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి మున్సిపాలిటీలో విలీనం కావడంతో 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు కౌన్సిలర్‌గా మొదటిసారి ఎన్నికయ్యారు.
2026లో రెండోసారి అదే వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలిచి వైస్‌చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వార్డుల్లో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించి పని చేస్తారనే పేరు ఉంది. మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్‌గా ఎన్నికకావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. మున్సిపల్ ఆఫీస్ నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కాసర్ల గోదావరితోపాటు కౌన్సిలర్లు గరిగంటి లక్ష్మీనారాయణ, గరిగంటి స్వప్న, మీర్జా హఫజ్ బేగ్, పిట్ల వేణుగోపాల్, అర్కల ప్రభాకర్ యాదవ్, పరిన్ కాథూన్, గోపు బాలమణి, లోలపు శ్రీనివాస్, ఏజాజ్, మామిండ్ల లక్ష్మణ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.