హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): బీడుపడ్డ తెలంగాణ భూములకు కృష్ణా జలాలను మళ్లించాలని గళమెత్తి నినదించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషి ఫలించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కృష్ణా జలాల కేటాయింపు విషయంలో 1956 అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారమే వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేయడంపై ఆమె హర్షం వ్యక్తంచేశారు.
‘కృష్ణా నీళ్లలో మా వాటా మాకు కావాలి అని కేసీఆర్ చేసిన పోరాట ఫలాలు అందుకోవడం ఎంతో దూ రంలో లేదు’ అని ఆమె స్పష్టంచేశారు. ‘రాష్ర్టాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరపాలని గత పదేండ్లుగా కేసీఆర్ చేసిన వాదనకే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మొగ్గు చూపడం సంతోషకరం.. ట్రిబ్యునల్ ఆదేశాలు బీఆర్ఎస్ విజయం, ఇది తెలంగాణ ప్రజల విజయం’ అని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన కవితకు ప్రత్యేక లేఖ రాశారు. కాగా, ఆమె సైతం తమిళనాడు సీఎంకు కృతజ్ఞతాపూర్వక లేఖ రాశారు. ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్సీ కవిత లేఖ రాయటంతోపాటు తన ఎక్స్‌వేదికగా తమిళంలో కృతజ్ఞతలు తెలియజేయటం గమనార్హం.