హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో ఆమోదం పొందిన 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టరూపం తీసుకురావడంలో తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు రామచందర్రావును ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రామచందర్రావుకు ఆమె లేఖ రాశారు. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర కమిటీ తరఫున చొరవ తీసుకోవాలని, రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆమె డిమాండ్ చేశారు. సమాన అవకాశాల కోసం ఓబీసీలు దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారని ఆ లేఖలో ప్రస్తావించారు. ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాలకు దిగొచ్చిన తెలంగాణ సర్కారు.. రెండు బీ సీ బిల్లులను ఆమోదించి, కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. చాలారోజులు గడుస్తున్నా ఆమోదముద్ర పడలేదని, బీజేపీ నేతలు చొరవ తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.