భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారని చెప్పారు. రాజకీయాలకతీతంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు అందిస్తూ కుటుంబ పెద్దలా అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ట్వీట్ చేశారు.
ప్రసవానికి వారం గడువున్న గర్భిణులను ముందుగానే దవాఖానాలకు తరలించి, ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. వరద ప్రాంతాల్లో వైద్యం, విద్యుత్, తాగునీటి వసతులకు ఎలాంటి అవాంతరాలు రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నలా వ్యవహరిస్తున్నారని వివరించారు. ఒక వైపు ప్రభుత్వం.. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం ఎక్కడికక్కడ వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు ధైర్యాన్నిస్తున్నారని కవిత చెప్పారు.