హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆ స్ఫూర్తితో ఓబీసీ హకుల సాధన ఉద్యమం సాగాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పట్టదలతో, కార్యదీక్షతో చేసే ప్రతి ఉద్యమం ఫలితాన్ని ఇస్తుందని తెలిపారు. కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని ఓబీసీ హకుల కోసం మధ్యప్రదేశ్‌లో పోరాటాన్ని ప్రారంభించటం పట్ల హర్షం వ్యక్తంచేశారు. దామాషా ప్రకా రం రిజర్వేషన్లు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డా రు.
బీసీ కులగణన చేపట్టాలని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టం పోస్ట్‌డేటెడ్ చెకు వంటిదని విమర్శించారు. కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రి త్వ శాఖ ఏర్పాటు చేయాలని వెల్లడించారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని దతియాలో నుంచి ఓబీసీ హకుల ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్‌సింగ్ యాదవ్ తలపెట్టిన ‘పీడిత్ అధికార్ యాత్ర’ ప్రారంభోత్సవానికి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓబీసీ ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికారు.
యాత్రను ప్రారంభించిన అనంతరం కవిత మాట్లాడుతూ.. ఓబీసీలను ఐక్యం చేయడానికి దామోదర్‌యాదవ్ ముందడుగు వేయటం ప్రశంసనీయమని కొనియాడారు. ఇది ప్రజల కోసం, వెనుకబడిన వర్గాల కోసం చేస్తున్న ఉద్యమమని పేర్కొన్నారు. ‘రాహుల్‌గాంధీ వం టి వారు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దేశంలో ఓబీసీ న్యాయమూర్తులు ఎంత మంది ఉన్నారని అడుగుతున్నారు. ఎవరి తప్పు? అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఓబీసీ న్యాయమూర్తుల సంఖ్యను ఎందుకు ఎకువ చేయలేకపోయింది?’ అని ప్రశ్నించారు.
ఇదే రాష్ట్రానికి చెందిన ఓబీసీ మహిళ ఉమాభారతి సీఎంగా పనిచేయడమేకాక జాతీయ స్థాయిలో కీలక నాయకురాలిగా ఎదిగారని ప్రస్తావించారు. దామోదర్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ఫూర్తితో ఓబీసీ హక్కులు సాధించడానికి ఉద్యమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. సంకల్పంతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనడానికి కేసీఆర్ ఉదాహరణ అని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా పదేండ్లపాటు రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించారని వివరించారు.