హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ఏరియాలో గులాబీ జెండా ఎగరాలని, ఈ ప్రాంతంలోని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను సింగరేణి పాఠశాలల కాంట్రాక్టు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ సర్కారు సింగరేణిని ప్రైవేట్‌పరం చేయాలని చూస్తే సీఎం కేసీఆర్ రక్షించారని గుర్తుచేశారు. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారని, సింగరేణి కార్మికులు, కార్మికుల కుటుంబాలను కాపాడారని స్పష్టంచేశారు. ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యలను తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఒకొకటిగా పరిషరిస్తూ వస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాకముందు వారసత్వ ఉద్యోగాల అంశం తీవ్రమైన సమస్యగా ఉండేదని గుర్తుచేశారు. అప్పట్లో కేవలం 4 వేల ఉద్యోగాలు మాత్రమే ఇస్తే, స్వరాష్ట్రంలో 20 వేల ఉద్యోగాలు కల్పించారని స్పష్టంచేశారు. మానవతా దృక్పథంతో ఆలోచించి సీఎం కేసీఆర్ వారసత్వ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సింగరేణి స్వరూపమే మారిపోయిందని వెల్లడించారు. సింగరేణి సంస్థలోని పాఠశాలల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యలను కూడా ప్రభుత్వం పరిషరిస్తుందని హామీ ఇచ్చారు. తాను కూడా చొరవ తీసుకొని సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానని, అవసరమైతే సీఎంతో సింగరేణి కార్మిక నాయకులకు సమావేశం ఏర్పా టు చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. కవితను కలిసినవారిలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రటరీ మిర్యాల రాజిరెడ్డి ఉన్నారు.