హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న ఒంటరి పోరాటం ఫలిస్తున్నది. ఆమె చేస్తున్న పోరాటానికి కేంద్రం తలొగ్గినట్టు తెలుస్తున్నది. నేటి (సోమవారం) నుంచి జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే బీజేపీ ప్రజాప్రతినిధులకు సంకేతాలు పంపినట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాట ఫలాలు మహిళలకు దక్కే అవకాశం ఉంది. గతంలోనూ లోక్‌సభలో ఎంపీగా ఆమె అనేక సందర్భాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు మహిళా సాధికారతపై గళం విప్పారు.
మహిళా రిజర్వేషన్ల గురించి దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలతో ఆమె చర్చించారు. దీంతో ఇప్పటికే అనేక పార్టీలు బిల్లుకు సానుకూలంగా స్పందించాయి. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయడం, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం, ఇటీవల 47 రాజకీయ పార్టీలకు లేఖలు రాయడం తదితర కార్యక్రమాల ద్వారా అనేక పార్టీల మద్దతును కూడగట్టారు. ప్రభుత్వం బిల్లును ప్రవేశపెడితే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం, శివసేన తదితర పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో కాంగ్రెస్ కూడా చేరింది. కవిత ఒత్తిడితో కాంగ్రెస్ పార్టీలోనూ కదలిక వచ్చింది. హైదరాబాదులో తాజాగా జరిగిన కాంగ్రెస్ వరింగ్ కమిటీ సమావేశంలో మహిళా బిల్లును ఆమోదించాలని ఆ పార్టీ తీర్మానం చేసింది. వరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనే ముందే మహిళా బిల్లుపై కాంగ్రెస్ వైఖరి ఏంటో చెప్పాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి తొమ్మిది అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రస్తావించకపోవడాన్ని కవిత తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఒత్తిడితోనే మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మహిళా రిజర్వేషన్ల గురించి ఏనాడూ మాట్లాడని కాంగ్రెస్ పార్టీ వరింగ్ కమిటీలో తీర్మానం చేయడం వెనుక కవిత కృషి దాగి ఉందని వారు పేర్కొంటున్నారు. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు ఈ బిల్లు విషయంలో మొదటి నుంచి తన బాధ్యతను కవిత గుర్తు చేస్తూనే ఉన్నారు. యూపీఏ హయాంలో 2010లో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందగా.. ఆ తర్వాత నాలుగేండ్ల పాటు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం లోక్‌సభలో దాన్ని ఆమోదించుకోలేకపోయింది. అనంతరం బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ దీనిపై స్పందించలేదు. ఈ విషయాలను పదేపదే కవిత ఎండగట్టడంతో కాంగ్రెస్‌లో చలనం మొదలైంది. కవిత చేసిన పోరాటం కారణంగానే కాంగ్రెస్ కూడా ఈ బిల్లుకు సానుకూలంగా స్పందించిందని, మహిళా సాధికారతకు ఆమె ఎనలేని కృషి చేస్తున్నారని పలు మహిళా సంఘాలు, జాతీయ మీడియా ప్రశంసిస్తున్నది.