యాదాద్రి భువనగిరి, జనవరి 22 (నమస్తే తెలంగాణ): మూసీ ప్రక్షాళన పేరుతో చేపట్టే ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంగా మార్చేందుకు కుట్ర చేస్తున్నదని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. మూసీ ప్రాజెక్టు పేరిట ధనాన్ని దోచి, ఢిల్లీకి కప్పం కట్టేందుకు కుయుక్తులు పన్నుతుందని ధ్వజమెత్తారు. మూసీ పేరుతో కోట్ల ప్రజాధనం లూటీ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న కొండపోచమ్మ సాగర్‌ను వదిలి, దూరంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి మూసీ-గోదావరి అనుసంధానం చేస్తామని ప్రభుత్వం అనడం ఏమిటని ప్రశ్నించారు. కేవలం కాంట్రాక్టర్ల కోసమే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని విమర్శించారు. అందుకే అనుసంధాన ప్రాజెక్టు వ్యయం రూ.7,500 కోట్లకు పెంచారని తెలిపారు.
దీనిపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా బుధవారం ఆమె యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ చేశారు. కొండపై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భువనగిరి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే మూసీ ప్రక్షాళన మొదలైందని, మూసీని గోదావరితో అనుసంధానం చేయాలని ఆనాడే భావించామని చెప్పారు. కేసీఆర్ హయాంలో 36 నీటిశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన అంటూ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపిస్తున్నదని మండిపడ్డారు.
నాగార్జున సాగర్‌కు అన్యాయం
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు అన్యాయం జరుగుతున్నదని కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తంచేశారు. సాగర్‌ను కేఆర్ఎంబీకి అప్పజెప్పారని, మన ప్రాజెక్టును మన కంట్రోల్లోకి తీసుకోవాలని కోరారు. సాగర్ నుంచి నీళ్లివ్వకుండా రైతులపై పాలకులు పగ తీర్చుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణానదిలో వాటాను కాపాడలేకపోయిందని తెలిపారు. ట్రిబ్యునల్‌లో మన వాదనలను బలంగా వినిపించాలని డిమాండ్ చేశారు. యాసంగిలో ఎస్సారెస్పీ నీళ్లివ్వకుండా పంటలను ఎడబెట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని అందించామని, జీరో ఫ్లోరైడ్‌గా మార్చామని, ఇదే విషయం సాక్షాత్తు పార్లమెంట్లో ప్రస్తావించారని గుర్తుచేశారు. సంక్రాంతికి సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారని, ఆయన అన్న సంక్రాంతి కూడా దాటి పోయిందని దుయ్యబట్టారు.
పథకాలు అందకుంటే నిలదీయండి
గ్రామసభల అనంతరం అర్హులకు నాలుగు పథకాలు అందకుంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీయాలని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ప్రజాపాలన, అభయహస్తం, కులగణన పేరుతో ఇప్పటికే పలు దఫాలుగా వివరాలు తీసుకున్నారని, మళ్లీ గ్రామసభల పేరుతో డ్రామాలు ఎందుకని ఆమె ప్రశ్నించారు. 60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ అని, అందరూ తలచుకుంటే కాంగ్రెస్ నేతలు తిరిగే పరిస్థితి ఉండదని, తమ పార్టీ కార్యాలయాలు, ఇండ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తేలేదని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, బూడిద భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.