MLC Kavitha | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే కాంగ్రెస్, బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అవసరమైతే మేం కూడా ఢిల్లీకి వచ్చి, బీజేపీపై పోరాటం చేస్తాం కానీ, కాంగ్రెస్ పార్టీని మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని సూచించారు. కామారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. బీసీ డిక్లరేషన్ చేసిన నిజామాబాద్ జిల్లాలోనే ఒక్క బీసీ బిడ్డకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వంచించిందని అన్నారు. అలవిగాని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. చరిత్రలో నిలిచిపోయే పనులు చేయాలి కానీ చరిత్ర హీనులుగా మిగలవద్దని సూచించారు. ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీ చరిత్రహీనులుగా మిగిలిపోతుందని అన్నారు. బీసీ బిల్లులు అసెంబ్లీ ఆమోదించిన తర్వాత చోటే భాయ్… బడే భాయ్‌కి అప్పగించారని తెలిపారు. కోర్టులకు వెళ్తారా… లేదా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ కాళ్ల మీద పడతారా అనేది తమకు సంబంధం లేదని.. 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు
కానీ ఇప్పటివరకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణలో కంటే ఎక్కువగా ఢిల్లీలోనే ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఎందుకు దొరకడం లేదని ప్రశ్నించారు. బీసీల విషయం వచ్చేసరికి ప్రధాని అపాయింట్మెంట్ ఎందుకు దొరకడం లేదని నిలదీశారు. తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్ల తరహాలో తెలంగాణలో కూడా అమలు చేయడానికి ప్రధాని మోదీ చొరవ తీసుకోవాలని కోరారు. రూ. 4,500 కోట్లు ఖర్చు చేసి 2011లో నిర్వహించిన కులగణన నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదంటే కాంగ్రెస్ వద్ద సమాధానం లేదని అన్నారు. 4,500 కోట్లు గంగలో పోశారు కానీ లెక్కలు అయితే బయటకు ఇవ్వలేదని అన్నారు. కులగణన చెయ్యబోమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి బీసీలను వంచించిందని చెప్పారు. తెలంగాణ చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లులను తక్షణమే పార్లమెంటు పాస్ చేయాలని డిమాండ్ చేశారు.బీసీ బిల్లులను ఆమోదించడానికి తెలంగాణ బీజేపీ ఎంపీలు పార్లమెంటులో గళమెత్తాలన్నారు.