నాగర్‌కర్నూల్/కొల్లాపూర్, ఫిబ్రవరి 28 : కాంగ్రెస్ సర్కారు కాకిలెక్కలు పక్కనపెట్టి బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో వేర్వేరుగా 46% రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో 46% రిజర్వేషన్లు కల్పిస్తూ వేర్వేరు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఒక్కటే బిల్లు పెడితే మొదటికే మోసం వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే తప్పుల తడకగా ఉన్నదని విమర్శించారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో బీసీలు 52% ఉన్నట్టు తేలగా, ప్రస్తుత కాంగ్రెస్ చేసిన సర్వేలో 46% ఉన్నట్టు ఎలా చెప్తారని, ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. బీసీ జనాభాను తగ్గించి చూపించేందుకు రేవంత్ సర్కారు బీసీ కులగణన చేపట్టినట్టున్నదని దుయ్యబట్టారు.
బీసీలను మోసం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. మూడు బీసీ బిల్లులు వచ్చే వరకు తగ్గేదే లేదని, పోరాటాలు చేస్తామని స్పష్టంచేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా బీసీ హక్కులకు రాజ్యాంగ రక్షణ రాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. బీసీలకు రాజ్యాంగ రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో ఇండియా ఆమెరికాను దాటిపోయేదని చెప్పారు. దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బైకని శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి వివరించారు. ఇంతకాలం బీసీలకు సరైన రిజర్వేషన్ లేక ఎంతో నష్టపోయామని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వివరించాల్సిన అవసరమున్నదని చెప్పారు. బీసీ కులాలను ఐక్యం చేయడానికి ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ప్రయత్నానికి వివిధ సంఘాల నాయకులతో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశంలో బీసీ సంఘాల నాయకులు కుర్మయ్య, గోపీగౌడ్, యాదగిరి, ప్రనీల్కుమార్సాగర్, మనోహర్‌యాదవ్, రాములు, సుభాష్, శ్రీనివాస్‌యాదవ్, సదానందం తదితరులు మాట్లాడారు.
పింక్‌బుక్‌లో చిట్టా రాస్తున్నం
‘ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్‌నగర్ గడ్డ మీది నుంచి చెప్తున్నా.. మేము కూడా పింక్‌బుక్ మెయింటెన్ చేస్తున్నం. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడి చేసిన వారి చిట్టా రాస్తున్నం.. మా టైం వస్తది.. అప్పుడు మీ సంగతి తేలుస్తం’.. అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని సింగోటం లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి ఆమె పూజలు చేశారు. అనంతరం సింగోటం, నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సింగోటం ఆలయ అభివృద్ధికి కేసీఆర్ ప్రభు త్వం రూ.17 కోట్లు మంజూరు చేస్తే దేవుడికిచ్చిన డబ్బులను జూపల్లి కృష్ణారావు క్యాన్సిల్ చేయించారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత శ్రీధర్‌రెడ్డి హత్యకు గురై ఇన్ని రోజులైనా కేసు ను ఇంకా ఛేదించలేదని, సాతాపూర్‌లో బీఆర్ఎస్ నేత పరమేశ్‌పై దాడి చేశారని పేర్కొన్నా రు. కొల్లాపూర్ నుంచి మామిడి ఎగుమతి కో సం గత ప్రభుత్వం మార్కెట్‌ను మం జూరు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవ డం లేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.