MLC Kavitha | ధరణిని వద్దంటున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని ఎమ్మెల్యీ కవిత పిలుపునిచ్చారు. ఎన్నికల్లో సరైన వాళ్లను గెలిపించుకుంటే మన తలరాతను మనమే మార్చుకోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ ఇప్పుడిప్పుడే తొవ్వల పడుతుందని.. సబ్బండ వర్గాలకు సంపద చేరాలంటే అది కేసీఆర్‌తోనే సాధ్యమని అన్నారు. రైతు బాంధవుడు కేసీఆర్ కావాలా? వ్యవసాయం తెలియని కాంగ్రెస్, బీజేపీ కావాలో ఆలోచన చేయాలని ప్రజలకు సూచించారు. ఢిల్లీ పార్టీ కావాలా? ఇంటి పార్టీ కావాలో ఆలోచన చేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్ఫల్లి మండలం నాగపూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన సభలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అపూర్వ స్వాగతం పలికిన నాగపూర్ గ్రామస్తులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ పండుగ వాతావరణం చూస్తుంటే జైత్ర యాత్రలా అనిపించిందని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదట గెలిచే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి అని ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా తెలిపారు.
దురదృష్టవశాత్తూ రైతులు చనిపోతే దేశంలో ఎక్కడ కూడా పట్టించుకునే వారు లేరు.. కానీ తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా ఇచ్చి ఆదుకుంటుందని తెలిపారు. యాదవులు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో కూడా జీవాలను ఎవ్వరూ ఇవ్వలేదని.. కేసీఆర్ మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో ఒక గిరిజన సోదరుడు పడ్డ కష్టాన్ని గుర్తించిన రూపొందించిన పథకమే కల్యాణ లక్ష్మీ అని వివరించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చే పథకం దేశంలోనే చరిత్ర సృష్టిందని అన్నారు. కులమతాలతో రాజకీయం చేసేవారిని నిలదీయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యీ కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. ధరణిని బంగాళాఖాతంలో పడేద్దామని కాంగ్రెసోళ్లు సోయి లేకుండా మాట్లాడుతున్నారని.. ధరణి వద్దంటున్న కాంగ్రెసోళ్లను తరిమికొట్టాలని అన్నారు. బీజేపీ ఎంపీ అర్వింద్ దారుణంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో సరైన వాళ్లను గెలిపించుకుంటే మన తలరాత మనం మార్చుకోవచ్చని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.