హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అవినీతి చక్రవర్తి అనే బిరుదు ఇస్తున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. విద్యకు, వైద్యానికి ఎండబెట్టి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తూ కమీషన్లు తీసుకుంటున్నరు కాబట్టే ఈ బిరుదు ఇస్తున్నట్టు చెప్పారు. ఏడాదిన్నర పరిపాలనలో రెండు లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. అన్ని అప్పులు చేసినా ప్రాజెక్టులు కట్టడం లేదని, పింఛన్లు పెంచలేదని, మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయం ఎకడకి పోతున్నదో ముఖ్యమంత్రి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.2 లక్షల కోట్ల అప్పు దేనికి ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.
ఒకటి రెండు నెలల్లో రేవంత్‌రెడ్డి అవినీతిపై జాగృతి ఆధ్వర్యంలో బుక్లెట్ ప్రచురించి రాష్ట్రవ్యాప్తంగా పంచుతామని హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో గురువారం కవిత మీడియాతో మాట్లాడారు. ఆధారాలు లేకుండా తాను ఏదీ మాట్లాడనని చెప్పారు. ‘కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను మేఘా, పొంగులేటి కంపెనీలు దకించుకున్నాయి. పనులు ప్రారంభం కాకముందే ఆ కంపెనీలకు అడ్వాన్స్‌లు ఇచ్చారు. ఒక్కో సంస్థకు రూ.600 కోట్లు ఇచ్చారు. అయినా, ప్రాజెక్టుకు సంబంధించి చెంచా మట్టి కూడా తీయలేదు. పదేండ్లలో కేసీఆర్ ఎప్పుడూ ఇలా అడ్వాన్సులు ఇవ్వలేదు. పనులు చేయండి పైసలు తీసుకోండి అన్నారు’ అని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రగతి ఎజెండాలో పోలవరం ప్రాజెక్టుపై చర్చను ఎత్తివేసినా తెలంగాణలో ఉన్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలకు చీమ కుట్టినట్టు కూడా లేదని కవిత విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా భద్రాద్రి రాముడు మునిగిపోతుంటే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రోకు రూపాయి ఇవ్వకున్నా నోరుమెదపడం లేదని విమర్శించారు. 2024 జూలై 6న ప్రజాభవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్ బిర్యానీ తినిపించి బనకచర్ల ప్రాజెక్ట్ కట్టుకోండని రేవంత్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఆరోపించారు.