హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ డైరెక్షన్లోనే సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రతీ విషయంలో ఆయన బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని, బీజేపీ నేతలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారని తెలిపారు. ఏదైనా అంశంలో తాము వాస్తవాలు బయటపెట్టగానే, బీజేపీ నాయకులు తమపైనే ఆరోపణలు చేస్తున్నారని, దీన్నిబట్టే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య దోస్తీ బట్టబయలైందని ఆరోపించారు.
ప్రధానిని కలిసిన తర్వాతే కేసీఆర్, కేటీఆర్‌పై కేసులు పెడతామంటూ రేవంత్‌రెడ్డి సంబంధం లేని విషయాలను అంటగట్టే కుట్రకు దిగారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలన్నదే ఆయన ఆలోచనగా ఉన్నదని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్పై కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఓ న్యాయవాది కోర్టులోనే వాదిస్తూ అందరి ముందే ఆరు నెలల క్రితమే గుండెపోటుతో మరణించారని, భూపాలపల్లిలో భూతగాదాల వల్లే ఓ హత్య జరిగినట్టు జిల్లా ఎస్పీ చెప్పారని, దుబాయ్‌లో ఓ వ్యక్తి నిద్రలోనే చనిపోయారని పత్రికల్లో వచ్చిందని వివరించారు. వీటన్నింటికీ కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధంలేకున్నా, రేవంత్‌రెడ్డి అంతులేని అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సంబంధం లేని అంశాల గురించి ప్రధానిని కలిసిన తర్వాతే సీఎం మాట్లాడారని, దీన్ని బట్టే కుట్ర జరుగుతున్నట్టు స్పష్టమవుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రధానిని కలిసిన తర్వాత తన సోదరుడు తిరుపతిరెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి అని సీఎం ప్రకటించారని, మరి అధికారిక కార్యక్రమాల్లో ఆయన ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. గుమ్మడి నర్యయ్య వంటి ప్రజానేతను గేటు బయటే నిలబెట్టి రేవంత్‌రెడ్డి అహంకారాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు. అహంకారానికి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్ రేవంత్‌రెడ్డి అని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ పనులే జరగలేదని సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారని కవిత మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ కమిటీ హాలులో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేశారని ఆమె గుర్తుచేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో అప్పటి ప్రతిపక్ష నేత జానారెడ్డిని ముందుపెట్టి కాంట్రాక్టరుకు రూ.100 కోట్లు అడ్వాన్స్‌ను కేసీఆర్ ఇచ్చారని స్పష్టంచేశారు. కరోనా తర్వాత కాంట్రాక్టరు పనులు చేపట్టలేమంటే మళ్లీ రూ.100 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీ 30 ఏండ్లలో ఈ ప్రాజెక్టుపై రూ.3,340 కోట్లు ఖర్చు చేస్తే, పదేండ్లలో కేసీఆర్ రూ.3,890 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఇంత ఖర్చు పెట్టి 11 కి.మీకుపైగా టన్నెల్ తవ్వి పనులు చేస్తే.. పనులే జరగలేదని రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐరన్ లెగ్ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే 4ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని ధ్వజమెత్తారు.
నెలకు రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామంటూ సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని కవిత మండిపడ్డారు. కాగ్ నివేదిక ప్రకారం ఏ నెల కూడా రూ.2,600 కోట్లకు మించి వడ్డీ చెల్లించలేదని తెలిపారు. ప్రతీ నెలా రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తున్నదని సీఎం చెప్తున్నారని, కాగ్ లెక్కల ప్రకారం రాష్ర్టానికి రూ.12 వేల కోట్లకు మించి ఆదాయం రాలేదని స్పష్టం చేశారు. మరి ఈ అబద్ధపు లెక్కలు ఎందుకు, ఎవరిని మభ్యపెట్టడానికని ప్రశ్నించారు.