ఖలీల్‌వాడి, నవంబర్ 10: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క సీటును బీసీలకు కేటాయించని కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బీసీల భావోద్వేగాలను గౌరవించి, వారి సంక్షేమంకోసం పాటుపడుతున్న పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టంచేశారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం కవిత మీడియాతో మాట్లాడారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండటంతో ఉమ్మడి జిల్లాతోపాటు పరిసర జిల్లాలు అభివృద్ధిలో దూసుకుపోతాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని.. ఇలాంటి సందర్భంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారని విమర్శించారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 8 జనరల్ సీట్లలో కాంగ్రెస్ 4 సీట్లను బీసీలకు కేటాయించిందని గుర్తుచేశారు.
ఈ ఎన్నికల్లో రేటెంతరెడ్డి గాంధీభవన్‌లో గాడ్సేలా దూరి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. బాన్సువాడలో బీసీ నాయకుడు కాసుల బాలరాజు టికెట్‌ను ధనవంతుడైన ఏనుగు రవీందర్‌రెడ్డికి అమ్ముకున్నారని, ఎల్లారెడ్డి, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో బీసీలకు అవకాశం ఇవ్వకుండా ఇతరులకు టికెట్లు ఇచ్చారని విమర్శించారు. టికెట్ రాలేదన్న మనస్తాపంతో బాలరాజు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని, కామారెడ్డి వరకు వచ్చిన రేవంత్‌రెడ్డికి కనీసం ఆయనను పరామర్శించాలనే మానవ త్వం లేకపోవడం దురదృష్టకరమన్నారు. బీసీల రాజకీయ జీవితాలకు సమాధి కట్టి టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో పడేయాలని అన్నారు. రేవంత్ పోటీ కారణంతో కామారెడ్డి నుంచి మైనార్టీ అయిన షబ్బీర్‌అలీని నిజామాబాద్‌కు తరిమివేశారని ఆరోపించారు. హామీలను అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న కర్ణాటక సీఎం మన రాష్ర్టానికి వచ్చి బీసీలకు ఏం చేయాలో సీఎం కేసీఆర్‌కు పాఠాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశా రు. 2014 నుంచి ఇప్పటివరకు బీఆర్ఎస్ బీసీల కోసం రూ.45 వేల కోట్లను ఖర్చు చేసిందన్నారు.
విజయీభవ
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెంట రాగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి బిగాల గణేశ్ గుప్తా.. రెండో సెట్ నామినేషన్‌ను శుక్రవారం దాఖలు చేశారు. ఇంటి వద్ద ఎమ్మెల్సీ కవిత గణేశ్ గుప్తాకు వీర తీలకం దిద్ది విజయీభవ అంటూ దీవించారు. గణేశ్ గుప్తాకు సెంటిమెంట్ అయిన గులాబీ రంగు అంబాసిడర్ కారును కవిత స్వయంగా నడుపుతూ నామినేషన్ సెంటర్‌కు వెళ్లారు.
సిద్ధరామయ్య నిజాలు తెలుసుకొని మాట్లాడాలి
దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎం కేసీఆర్‌ను విమర్శించే హక్కు సిద్ధరామయ్యకు లేదని కవిత పేర్కొన్నారు. సిద్ధరామయ్యలా కాకుండా.. ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్‌దేనని, మ్యానిఫెస్టోలో చేర్చని హామీలను కూడా అమలు చేసి చూపించారని తెలిపారు. తెలంగాణ వంటి రాష్ర్టాలకు వచ్చే ముందు ఇక్కడి స్థితిగతులను తెలుసుకొని రావాలని సిద్ధరామయ్యకు సూచించారు. అనేక పథకాలతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు.