హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఈ ఏడాది పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 3న ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న బీసీ మహాసభ పోస్టర్‌ను బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమె ఆవిష్కరించారు. అనంతరం కవిత మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఏడాది గడిచినా బీసీలకు ఇచ్చిన ఏ ఒక హామీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. బీసీ మహాసభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కవిత పిలుపునిచ్చారు. బీసీ మహాసభకు తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ విద్యార్థి జేఏసీతోపాటు వివిధ ప్రజా, కుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
బీసీల కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ కవితకు తాము మద్దతుగా ఉంటామని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ప్రకటించారు. తాము పెద్ద సంఖ్యలో మహాసభకు హాజరవుతామని, తమ హకులను సాధించుకుంటామని స్పష్టంచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట బీసీ మహాసభ పోస్టర్‌ను తెలంగాణ విద్యార్థి జేఏసీ ప్రదర్శించింది. ఎమ్మెల్సీ కవిత నిర్వహించే బీసీ మహాసభకు పెద్ద ఎత్తున తరలివస్తామని తెలంగాణ ముదిరాజ్ హకుల సాధన సమితి రాష్ట్ర యూత్ అధ్యక్షుడు పడిగే ప్రశాంత్ ముదిరాజ్ ప్రకటించారు. ముదిరాజ్‌లకు ఉచిత చేప పిల్లలు పంపిణీ తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ నుంచి బీసీ కుల సంఘాల నేతలంతా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని బీసీ కుల సంఘాల రాష్ట్ర నాయకుడు గుంజ పడుగు హరిప్రసాద్ తెలిపారు. కవిత నివాసంలో జరిగిన కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు బొల్లా శివశంకర్, పెంటా రాజేశ్, సుంకోజు కృష్ణమాచారి, ఆలకుంట్ల హరి, కుమారస్వామి, విజేందర్సాగర్, రాచమల్ల బాలకృష్ణ, కోళ్ల శ్రీనివాస్, సాల్వా చారి, మురళి, నిమ్మల వీరన్న, లింగం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.