డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే కాళేశ్వరం నివేదిక పేరుతో రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అది కాంగ్రెస్ పార్టీ కమిషన్ అని, తాము ధర్నా చౌక్ వేదికగానే ఎత్తిచూపామని అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో కేసీఆర్ పేరును 36 సార్లు ప్రస్తావించినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్లు కాదని ఆమె స్పష్టం చేశారు. నిపుణుల కమిటీ సూచనల మేరకే నిర్మాణాలు జరిగాయని తెలిపారు. ప్రాజెక్టులో అత్యధిక టెండర్లు దక్కించుకున్న మేఘా కృష్ణారెడ్డిని ఎందుకు విచారించలేదో చెప్పాలని నిలదీశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సోమవారం ఇందిరా పార్కు వద్ద గల ధర్నా చౌక్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. దీక్షకు వేలాది మంది ప్రజలు, ఆయా కుల సంఘాలు, ప్రజా సంఘాలు హాజరై మద్ధతు ప్రకటించారు. అయితే సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ హైకోర్టుకు వెళ్తే, ప్రభుత్వం అనేక సాకులతో దీక్షకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకుందని అన్నారు. తాము 72 గంటల దీక్షకు అనుమతి కోరితే ప్రభుత్వం నాలుగు రోజుల పాటు దీక్షను వాయిదా వేయాలని హైకోర్టుకు సూచించిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు 72 గంటల నిరాహారదీక్షకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. తెలంగాణ జాగృతి క్రమశిక్షణ గల సంస్థ అని కోర్టు ఆదేశలను గౌరవిస్తూ 72 గంటల నిరాహారదీక్షను విరమిస్తున్నానని ప్రకటించారు. ఇది విరమణ కాదు విరామం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూబీసీల తరపున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అంతకుముందు దీక్ష ప్రారంభ సమయంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే రణరంగాన్ని సృష్టిస్తామని తేల్చిచెప్పారు. ఇది రాజకీయ పోరాటం కాదని, బీసీల ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటమని స్పష్ట చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులో ముస్లీంలకు కూడా వాటా ఉందన్న అనుమానం ఉన్నందున దాన్ని ఆపుతున్నామని బీజేపీ నాయకులు చెబుతున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు ముస్లీంలకు 10 శాతం రిజర్వేషన్లకు సపరేట్ బిల్లును పెడుతామని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాలని సూచించారు.