హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తేతెలంగాణ): మూసీ అభివృద్ధి ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేయకుండానే ప్రపంచబ్యాంకును, కేంద్ర ప్రభుత్వాన్ని సాయం ఎలా అడిగారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ సభ్యులు మధుసూధనాచారి, సుంకరి రాజు, కాంగ్రెస్ సభ్యుడు టీ జీవన్‌రెడ్డి, ఎంఐఎం సభ్యుడు అమీర్ అలీ అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్‌బాబు సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా అభివృద్ధి కోసం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) ద్వారా డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు ప్రస్తావించారు. ఈ అంశంపై ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వానికి ప్రశ్నలను సంధించారు. మూసీ నది విషయంలో డీపీఆర్ ఆధారంగా అంచనా వ్యయాలు ఉంటాయని ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్నదని, కానీ రూ.4,100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించినట్టు తమకు నిర్ధిష్టమైన సమాచారం ఉన్నదని చెప్పారు.
మూసీ ప్రక్షాళన కోసం రూ.14,100 కోట్ల వ్యయం అవుతుందని, నిధులతోపాటు అనుమతులు ఇప్పించాలని ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి ఏ ప్రాతిపదికన అడిగారని నిలదీశారు. ఈ విషయాలు వాస్తవమా కాదా? సభకు తెలపాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్రాన్ని, ప్రపంచబ్యాంకు సాయం కోరడం వాస్తవమైతే సభను, రాష్ట్ర ప్రజలను ఎందుకు తప్పదోవ పట్టిస్తున్నారు? ఈ విషయంలో అవసరమైతే ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెడుతామని కవిత హెచ్చరించారు. ఇదిలా ఉండగా, మూసీ అంశం పై ఇప్పటివరకు డీపీఆర్‌లే సిద్ధం కాలేదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మూసీ ప్రాజెక్టుకు సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడం కోసం ఎంఆర్డీసీఎల్కు కన్సార్టియం, మాస్టర్ ప్లాన్‌కు కన్సల్టెంట్‌ను ఎంపిక చేసినట్టు తెలిపారు.
అభివృద్ధి పేరిట మూసీ పరీవాహక ప్రాంతంలో కూలగొట్టిన ఇండ్లకు ఉన్న ఈఎంఐలను ప్రభుత్వం చెల్లిస్తుందా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు. మూసీ నదీ గర్భంలో నివసించే 309 కుటుంబాలు వాళ్లంతట వాళ్లే ఖాళీ చేసి వెళ్లిపోయారని, 181 కుటుంబాలు తామంతట తామే కూల్చేసుకొని ఇప్పటికే వెళ్లిపోయారని ప్రభుత్వం చెప్తున్నదని, కానీ హృదయ విదారకమైన వీడియోలను చూస్తే ఈ విషయం అవాసస్తవమని తెలుస్తున్నదని ఆమె చెప్పారు. ఆ 309 కుటుంబాలు సమ్మతిస్తూ ప్రభుత్వానికి ఏవైనా పత్రాలపై సంతకాలు చేసి ఉంటే అవి సభ్యులకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వడ్రంగి, కమ్మరి కులస్తులు తయారు చేసే పనిముట్ల కోసం ఉపయోగించే యంత్రాలకు నూరుశాతం విద్యుత్తు సబ్సిడీ ఇవ్వాలని జీరో అవర్‌లో కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి వడ్డీలేని రుణాలు ఇవ్వాలని, రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం కల్పించాలని, వ్యవసాయ పనిముట్ల తయారీకి అనుమతులివ్వాలని, 10 అడుగుల పొడ వు కర్ర రవాణాకు వెసులుబాటు కల్పించాలని కోరారు. ఫర్నిచర్, ఫ్యాబ్రికేషన్ కోసం ఇండస్ట్రీ పార్కు లేదా హబ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.