MLC Kavitha | గిరి ప్రదక్షిణలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అనంతరం కవిత మాట్లాడారు. తెలంగాణ ప్రజల కొంగుబంగారంగా యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ మహాఅద్భుతంగా నిర్మించారని గుర్తు చేశారు. యాదాద్రిని టెంపుల్ సిటీ ఆఫ్ వరల్డ్‌గా నిలబెట్టుకున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఆలయాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. కేసీఆర్ హయాంలో క్షేత్రాన్ని రూ.1200కోట్లతో అభివృద్ధి చేశారన్నారు. స్వామివారి అనుగ్రహంతో కేసీఆర్ ఆలయాన్ని పునర్నిర్మించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మళ్లీ గిరి ప్రదక్షిణ చేసేలా భగవంతుడు శక్తినివ్వాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించేలా దీవెనలు ఇవ్వాలని స్వామివారిని కోరుకున్నానన్నారు. ప్రతినెల స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షణలో భక్తులు పాల్గొని.. యాదాద్రీశుడి కృపకు పాత్రులు కావాలని కవిత పిలుపునిచ్చారు.