హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ ) : గిట్టుబాటు ధరలేక నిజామాబాద్ పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. వారు రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నా పట్టించుకోవడంలేదు ఎందుకని నిలదీశారు. ఎన్నికల ముందు క్వింటాల్‌కు రూ.15 వేలు ఇస్తామని రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చడంలేదు ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఓట్ల కోసం మాయమాటలు చెప్పిన కాంగ్రెస్, బీజేపీ గద్దెనెక్కిన తర్వాత పసుపు రైతుల సమస్యలపై నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. పసుపునకు మార్కెట్లో క్వింటాల్‌కు రూ.9 వేలు కూడా దక్కకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించేందుకు కనీస చర్యలు తీసుకోకుండా అన్నదాతను నయవంచనకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే క్వింటాల్ పసుపునకు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.
పసుపు బోర్డు తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న ఎంపీ అర్వింద్ గిట్టుబాటు ధరలేక నష్టపోతున్న రైతులను ఎందుకు పట్టించుకోవడంలేదు? కనీసం వారిని పరామర్శించి భరోసా ఇవ్వడంలేదెందుకు? అని కవిత సూటిగా ప్రశ్నించారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనాలు కలగడంలేదని అన్నారు. పసుపు ధర పెంచుతామని, రైతులను ఆదుకుంటామని బోర్డు ప్రారంభోత్సవం సమయంలో చెప్పిన బండి సంజయ్ ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు.
సంచార జాతులకు డీఎన్టీ (డీనోటిఫైడ్ ట్రైబ్స్) సర్టిఫికెట్లు జారీ చేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కోకన్వీనర్ బోళ్ల శివశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ సంచార జాతుల సంఘం నేత కోల శ్రీనివాస్ మంగళవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిశారు. సంచార జాతుల సమస్యలను శాసనమండలిలో లెవనెత్తాలని విజ్ఞప్తిచేశారు. డీఎన్టీ సర్టిఫికెట్లు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు అందడంలేదన్నారు. కవితను కలిసిన వారిలో సంచార జాతుల సంఘం నేతలు ఉన్నారు.
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను పసుపు బోర్డు ఎండీ భవానీశ్రీ ఆదేశించారు. పసుపు రైతులు నష్టపోకుండా చూడాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ఈనామ్ పోర్టల్‌లో పసుపు పంటకు వచ్చే గరిష్ఠ ధరను ఆధారంగా చేసుకొని, నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా రైతులకు న్యాయమైన ధర లభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ డైరెక్టర్ సురేంద్ర మోహన్, నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పాల్గొన్నారు.