హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ జాగృతి, యూనైటెడ్ పూలే ఫ్రంట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నది. సోమవారం తెలంగాణ జాగృతి నాయకులు నవీన్ ఆచారి, యూపీఎఫ్ కో కన్వీనర్ బొళ్ల శివశంకర్ నేతృత్వంలో నాయకులు ఇందిరాపారు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. బీసీల ఆత్మబంధువు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని చాలాకాలం నుంచి ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తున్నారు. పలుసార్లు ధర్నాలు, దీక్షలు నిర్వహించడమే కాకుండా విగ్రహ ఏర్పాటు ఆవశ్యకతపై పలు జిల్లాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు సైతం నిర్వహించారు.
ఇదే అంశంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను రెండుసార్లు కలిసి వినతిపత్రాలు అందజేశారు. అయినా, ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 11న పూలే జయంతిలోగా విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరాపారు వద్ద బొళ్ల శివశంకర్ మీడియాతో మాట్లాడుతూ.. బీసీల విషయంలో ప్రభుత్వానికి చిన్నచూపు తగదని చెప్పారు. బీసీల ఆరాధ్య దైవమైన పూలే విగ్రహాన్ని చట్టసభల ఆవరణలో ఏర్పాటు చేసి గౌరవించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం విస్మరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, ఎమ్మెల్సీ కవిత నాయకత్వంలో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. బీసీలను మోసం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత దీక్షకు వేలాది ప్రజలు, బీసీలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు నవీన్ ఆచారి, శ్రీధర్‌రావు, పెంటా రాజేశ్, యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు అలకుంటల హరి, గోపు సదానంద్, మారయ్య, నిమ్మల వీరన్న, విజేందర్సాగర్, డీ నరేశ్‌కుమార్, అశోక్‌యాదవ్, లింగం శాలివాహన, పుష్పాచారి తదితరులు పాల్గొన్నారు.
ఫూలే విగ్రహ సాధన దీక్షకు తరలిరండి
అసెంబ్లీలో జ్యోతిబాఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఎమ్మెల్సీ కవిత మంగళవారం చేపట్టనున్న నిరాహార దీక్షకు బీసీలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని యూపీఎఫ్ కోకన్వీనర్ బొల్లం శివశంకర్ పిలుపునిచ్చారు. సోమవారం ఇందిరాపార్క్ వద్ద దీక్ష ఏర్పాట్లను జాగృతి, యూపీఎఫ్, బీసీ సంఘాల నాయకులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫూలే జయంతిలోగా విగ్రహం ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
బీసీలను మోసం చేస్తే ఊరుకోబోమని తేల్చిచెప్పారు.