హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎకడాలేదని, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగిన జగిత్యాల కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే సంజయ్’ అనే నినాదం స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. గత ఎన్నికల్లో జగిత్యాల అడ్డాపై బీఆర్ఎస్ జెండా ఎగరడం చాలా సంతోషకరమని చెప్పారు.
కరోనా సమయంలో విశేష సేవ చేసిన ఎమ్మెల్యే సంజయ్‌ని ఆమె అభినందించారు. ఎమ్మెల్సీ రమణ సమన్వయంతో సంజయ్‌కుమార్ తప్పకుండా మరోసారి అద్భుతమైన మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోయినవాళ్ల గురించి ఆలోచించవద్దని ఈ సందర్భంగా కవిత స్పష్టం చేశారు. జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్‌తోనే బీఆర్ఎస్కు పోటీ అని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గానికి జీవన్‌రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు.