నిజామాబాద్ : అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్సీ కవిత మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మూడు నెలల పాటు ఉచితంగా భోజన సౌకర్యాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నారు. ఈ కోచింగ్ సెంటర్‌ను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కవిత సందర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా, ఒక క్రమపద్ధతిలో చదవాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు. మళ్లీ అలాంటి అన్యాయానికి నిరుద్యోగులు గుర్తికావొద్దనే ఉద్దేశంతో 317 జీఓ అమలు చేస్తున్నట్లు తెలిపారు. 317 జీఓ వల్ల స్థానికులకే ఉద్యోగాలు దక్కుతాయి అని వివరించారు. ఈ జీఓపై కొందరు పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారి మాటలు నమ్మొద్దని ఉద్యోగార్థులకు కవిత సూచించారు. టీ శాట్ ద్వారా ప్రసారం అవుతున్న క్లాసులను ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ మూడు నెలలు కష్టపడి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.