MLC Kavitha | బీజేపీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంలో తెలంగాణ లేదని, కాంగ్రెస్ భారత్ జోడో నినాదంలోనూ తెలంగాణ ప్రస్తావన లేదని.. తెలంగాణ బాగుపై ఆలోచన లేదని ఆలోచన లేని ఆ రెండు పార్టీలు మనకు అవసరమా ? అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. నిజామాబాద్‌లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ చెప్పుకునే సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ నినాదంలో ఎక్కడా కూడా తెలంగాణ ప్రస్తావన లేదన్నారు. ఆ నినాదంలో తెలంగాణ ఉండి ఉంటే రాష్ట్రానికి ఐఐఎం, ఐఐటీ, మెడికల్ కాలేజీలు ప్రత్యేకంగా వచ్చేవని తెలిపారు.
ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి అదనపు సాయం ఒక్కటి చేయకపోవడమే కాకుండా అనేక పనుల్లో అడ్డంకి సృష్టించిందని విమర్శించారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను అన్యాయంగా, అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటును బీజేపీ ఎప్పుడూ ఓర్చుకోలేదని విమర్శించారు. ప్రధాని మోదీ నుంచి ప్రతీ ఒక్క బీజేపీ నేత తెలంగాణ గురించి అవహేళన చేస్తూ మాట్లాడారే తప్పా మనస్ఫూర్తిగా సహకారం అందించిన సందర్భం లేదంటూ ధ్వజమెత్తారు.
బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు తదితర రాష్ట్ర విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని గుర్తు చేశారు. బీసీలకు అవి చేశాం.. ఇవి చేశామంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పడంతో నవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ వ్యక్తిని మార్చి ఓసీ వ్యక్తిని అధ్యక్షుడిగా చేసి కొత్తగా బీసీని చేస్తామని ఆ పార్టీ చెబుతుండడం హాస్యాస్పదమన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని, ఈ సారి ఆ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేదు కాబట్టి గాలి మాటలకు బీసీ నినాదం ఎత్తుకుంటున్నారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర చేస్తే అందులోనూ ఎక్కడా కూడా తెలంగాణ ప్రస్తావన లేదని.. ఇక్కడ యాత్ర చేసినప్పుడు కూడా రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడలేదన్నారు. బీజేపీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్‌లో, కాంగ్రెస్ భారత్ జోడోలో తెలంగాణ ప్రస్తావన ఉండదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు పార్టీల ఆలోచనలో కనీసం తెలంగాణ లేదని, లాంటి పార్టీలు మనకు అవసరమా ? అని ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రూ.1000కోట్ల బడ్జెట్ ఇస్తామని ఇవ్వడం లేదని ప్రధాని ఆరోపిస్తున్నారని, కానీ ఈ సారి బీసీలకు కేటాయించిన బడ్జెట్ రూ.6200కోట్లు అని గుర్తు చేశారు.
గత ఏడాదిన్నర కాలంలో బీసీ ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మికి రూ.1,850కోట్లు, బీసీలకు ఫీజు రీయింబర్స్మెంట్ రూ.1,300 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇంత చేస్తున్న రాష్ట్రానికి వచ్చి ప్రధాన మంత్రి బీసీలకు రూ.1000కోట్లు ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. షాదీ ముబారక్ తప్పా ముస్లిం మైనారిటీలకు బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదని నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
60ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం 12 పాఠశాలు ఏర్పాటు చేసి కేవలం 6వేల మంది ముస్లిం విద్యారులకు చదివించారని.. పదేళ్లలో 200 పాఠశాలలు పెట్టి లక్ష మంది మైనారిటీ విద్యార్థులకు విద్యనందిస్తున్న వ్యక్తి కేసీఆర్ అని వివరించారు. నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కు అంతే తేడా ఉంటుందన్నారు. తమతో పోల్చుకోగలిగిన పనులను కాంగ్రెస్ ఎప్పుడూ చేయలేదన్నారు. నిజామాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి గణేశ్ గుప్తా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.