ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): వడ్ల కొనుగోలుపై ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన దీక్ష విజయవంతమైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ధాన్యం సేకరణపై 24 గంటల్లో బీజేపీ తన వైఖరిని మార్చుకోకపోతే సీఎం కేసీఆర్ నేతృత్వంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు, రైతులతో కలిసి తాడోపేడో తేల్చుకొంటామని, కేంద్రంపై పోరుకు వారంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు కండ్లు తెరవాలని సూచించారు. మోదీ ప్రభుత్వం రైతుల శక్తిని తకువగా అంచనా వేస్తున్నదని విమర్శించారు. ఢిల్లీలో తాము దీక్ష చేస్తుంటే హైదరాబాద్లో బీజేపీ దొంగ ధర్నా చేసిందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రైతులు పంటలపై పెట్టిన కనీస ఖర్చులు కూడా రావడంలేదని, అయినా క్రూరమైన బీజేపీ ప్రభుత్వానికి రైతుల పట్ల సానుభూతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాలు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఒకే దేశం- ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలని డిమాండ్ చేశారు.