MLC Kavitha | రైతుబంధు ఇవ్వాలన్న సోయి ప్రభుత్వానికి లేదని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ కన్నబిడ్డలను చూసుకున్నట్లుగా ప్రజలను చూసుకున్నారన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని.. రైతుబంధు ఇవ్వాలన్న సోయి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. రైతు కూలీలకు కూడా సాయం చేస్తామన్న ప్రభుత్వం.. ఇప్పటికీ ఏం చేయలేదన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని.. రాష్ట్రంలో ప్రతీ మూడు గంటలకు మహిళలపై ఒక అత్యాచారం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ ఐదు గంటలకు ఒక మహిళా కిడ్నాప్ అవుతోందని.. మహిళా భద్రత కోసం కేసీఆర్ షీటీమ్స్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు పోలీసులు కాంగ్రెస్ నేతలు చుట్టూ తిరగడం తప్పా.. ఏం చేయడం లేదని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీగా ఉండేదని.. ఇప్పుడు కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత లేకపోవడం దారుణమని.. సీఎం రేవంత్ రెడ్డి మహిళా భద్రతపై ప్రత్యేకంగా సమీక్షించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగమంటూ తిరుగుతుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనట్లు రెండు పెద్ద ఎన్ కౌంటర్లు జరిగాయని.. తుపాకీ మోతలు ఉండవద్దన్న లక్ష్యంతో పరిపాలన చేసిన వ్యక్తి కేసీఆర్ అని.. ఇవాళ రేవంత్ రెడ్డి శాంతి భద్రతలకు భగ్నం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం… బిల్లులు మాత్రం విడుదల చేసిందని.. రైతులను నరకయాతన పెట్టడానికి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం రీసర్వే చేసే ముందు భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భూముల రీసర్వే పేరిట ఒకరి పేరు మీద ఉన్న భూమిని మరొకరి పేరు మీద రాయన్న నమ్మకం ప్రజలకు, రైతులకు లేదని.. కాంగ్రెస్ పై ప్రజలు నమ్మకం కోల్పోయారన్నారు.
ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలన్నారు. రాబోయే రోజులు బీఆర్ఎస్వేనని.. నిజామాబాద్ జిల్లా అనాథగా మారిందని.. జిల్లా నుంచి కనీసం ఒక మంత్రి కూడా లేరని.. ఎంపీ ఉన్నా లేనట్లే.. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు పవర్ లేదన్నారు. ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులే అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారన్నారు. నిజామాబాద్‌కు ఆరు నెలల నుంచి పోలీసు కమిషనర్ లేకపోవడం దారుణమన్నారు. ఏడాదికాలంలో ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీలకు ఇవ్వలేదని.. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఒక కొత్త పని చేపట్టలేదన్నారు. ఎస్సారెస్పీ నుంచి నిజామాబాద్ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదన్నారు. మేడిగడ్డ విషయంలో కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న పిచ్చి ప్రయత్నంతో ఎస్సారెస్పీని ఎండబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల గురించి ప్రభుత్వాన్ని నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. షబ్బీర్ అలీకి నిజామాబాద్‌పై ఆలోచన లేదని, పట్టిలేదన్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఇష్టానుసారంగా ఇసుక దందా జరుగుతోందని.. ఇప్పుడు మైనింగ్ శాఖ ఆదాయం తగ్గిందన్నారు. కాంగ్రెస్ నాయకుల ఆదాయం పెరిగిందని.. ఇసుకు దోపిడీని అడ్డుకుంటామన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి 3 లక్షల 79 మంది బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేసిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 2 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసిందని.. నిజామాబాద్ జిల్లాలో ఇంకా లక్షా 2 వేల మందికి, కామారెడ్డి జిల్లాలో 75 వేల మందికి రుణమాఫీ కాలేదన్నారు. తెలంగాణ యూనివర్సిటీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. తక్షణమే నిధులు విడుదల చేసి… వర్సిటీ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని హితవు పలికారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కమిటీలతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం.. హైదరాబాద్‌లో హైడ్రా పెట్టినట్టు నిజామాబాద్‌లో నిడ్రా పెడుతామని పీసీసీ అధ్యక్షుడు చెప్పడం దారుణమన్నారు. బుల్డోజర్తో ప్రజల ఆస్తులు కూలగొడుతామని హెచ్చరిస్తున్నారని.. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్లను తీసుకెళ్తే మేము ఊరుకోబోమని హెచ్చరించారు.