కామారెడ్డి, మార్చి 5: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న విద్యార్థుల చావులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసమర్థత, పట్టింపులేని తనమే కారణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల చావులు చూశామని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనే చూస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. భువనగిరిలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలు నిరసన తెలిపితే వారిని అరెస్టు చేస్తారా? మార్పు అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.
మూడు నెలల్లో 15 మంది పిల్లలు చనిపోతే కనీసం పట్టించుకోలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు. బోధన్‌లోని బీసీ హాస్టల్లో తోటి విద్యార్థుల చేతిలో హత్యకు గురైన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారంతండాకు చెందిన డిగ్రీ ఫైనలియర్ విద్యార్థి హరియాల వెంకట్ కుటుంబసభ్యులను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి కవిత మంగళవారం పరామర్శించారు.
బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. వెంకట్ తల్లికి పెన్షన్, సోదరుడికి ఉద్యోగం, రూ.15 లక్షలు, డబుల్బెడ్రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆమె కామారెడ్డి శివారులోని పొందుర్తిలో మీడియాతో మాట్లాడుతూ.. ఒక చిన్న విషయానికి విద్యార్థి చనిపోవడం, మరో ఏడుగురు విద్యార్థులపై హత్య కేసు నమోదుచేయడం దారుణమని పేర్కొన్నారు. హాస్టల్లో వార్డెన్, వాచ్‌మన్ లేకపోవడం వల్ల ఈ సంఘటన జరిగిందని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత, పట్టింపులేని చర్యల వల్లనే ఎనిమిది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని ఆవేదన వ్యక్తంచేశారు. చిన్నపిల్లల జీవితాలతో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. పిల్లలు పిట్టల్లా రాలిపోతుంటే రాజకీయం చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌పై ఏడ్వడం తప్ప తెలంగాణకు రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదని మండిపడ్డారు. తన వద్దే విద్యాశాఖను ఉంచకున్న రేవంత్.. పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా ఒక్కసారైనా సమీక్షించలేదని మండిపడ్డారు. విద్యార్థుల వరుస ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే
ఆదిలాబాద్ సభలో మోదీని పెద్దన్న అనడంతో రేవంత్‌రెడ్డి నిజస్వరూపం బయటపడిందని కవిత దుయ్యబట్టారు. బీజేపీ, కాంగ్రెస్ మూమ్మాటికీ ఒక్కటేనని, ప్రాంతీయ పార్టీలు ఉండొద్దనేది ఆ రెండు పార్టీల లక్ష్యమని తెలిపారు. రేవంత్‌రెడ్డి ఆరెస్సెస్ మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి మోదీని పెద్దన్న అన్నాడని పేర్కొన్నారు.
ఎల్ఆర్ఎస్ను ఆపిందే కాంగ్రెస్
ఉచితంగానే భూముల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) చేయాలని కవిత డిమాండ్ చేశారు. లేకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ‘నో ఎల్ఆర్ఎస్-నో కాంగ్రెస్’ అనే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో ఎల్ఆర్ఎస్ను అమలుచేస్తామంటే కోర్టుకు వెళ్లి ఆపింది కాంగ్రెస్ నాయకులేనని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజిబుద్దీన్, నేతలు నిట్టు వేణుగోపాల్, జూకంటి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.