మేడ్చల్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదవారం ఆమె మేడ్చల్‌లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వానల వల్ల నష్టపోయిన ప్రాంతాలకు కేంద్రం ఒక్క రూపాయైనా సాయం చేసిందా? గుజరాత్, బీహార్‌కు ఒక నీతి తెలంగాణకు ఇంకో నీతా? అని ప్రశ్నించారు. కేంద్రం తీరుపై లెక్కలు రాసుకుని అవసరమైనప్పుడు ప్రజలే లెక్కలు తేల్చాలని పిలుపునిచ్చారు.
ఉద్యమానికి గుండె ధైర్యం ఇచ్చింది సారే
తెలంగాణ ఉద్యమానికి గుండె ధైర్యం ఇచ్చింది ప్రొఫెసర్ జయశంకర్సారే అని కవిత పేర్కొన్నారు. మంచి మనుషులు పుట్టినప్పుడు భూమాత సంతోషిస్తుందని, జయశంకర్‌సార్ పుట్టినప్పుడు కూడా తెలంగాణ తల్లి సంతోషపడి ఉంటుందన్నారు. జయంశంకర్ రాసిన లెక్కల వల్లే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో సింహగర్జన చేశారని వివరించారు. 2001 నుంచి కేసీఆర్‌కు జయశంకర్‌సార్ వెన్నంటి ఉన్నారని గుర్తుచేశారు. తెలంగాణ కో సం ఉద్యమిస్తున్న స్వచ్ఛమైన నాయకుడు కేసీఆర్ అని జయశంకర్‌సార్ చెప్పారని అన్నారు.
చరిత్ర సృష్టించిన కేసీఆర్: మంత్రి మల్లారెడ్డి
తెలంగాణను సాధించి, రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయంశంకర్సార్తోపాటు అమరవీరుల కలలను కేసీఆర్ నిజం చేశారని చెప్పారు. మేడ్చల్‌కు చెందిన అమరవీరుల కుటుంబసభ్యులకు సొంతంగా రూ.5 లక్షలు విరాళం అందజేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్‌సాగర్, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.