సుల్తాన్‌బజార్, జనవరి 6: నిరుద్యోగులకోసం రాష్ట్ర సర్కారు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు జారీచేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే తప్పా? అని ప్రశ్నించారు. శుక్రవారం నాంపల్లి గృహకల్ప ఆవరణలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు దేవరత్న డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, జిల్లా శాఖ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ వాటి బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని చెప్పారు.
దీన్ని హర్షించాల్సిందిపోయి తనకు జెండాలు మోసేవారు కరువయ్యారని బండి సంజయ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులు కేసీఆర్ తొత్తులని బండి సంజయ్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వారు తొత్తులు కాదని, కేసీఆర్ ఆత్మబంధువులని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో 13 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని పార్లమెంట్ సాక్షిగా చెప్పిన కేంద్ర సర్కారు.. వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని కవిత ప్రశ్నించారు.
ఉద్యోగులు సీఎం కేసీఆర్‌కు బాసటగా నిలువాలని మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అత్యధిక వేతనాలు పొందుతున్నారని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు రాజేందర్ పేర్కొన్నారు. ఒకే నెలలో 25 వేల పదోన్నతులు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన 16 మందిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.
కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు గజ్జెల నగేశ్, రావుల శ్రీధర్‌రెడ్డి, ఇంతియాజ్, ఆయాచితం శ్రీధర్, మహ్మద్ సలీం, మసీఉల్లాఖాన్, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ప్రతాప్, కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, కస్తూరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షురాలు ఉమాదేవి, కోశాధికారి ఆర్ శ్రీనివాసరావు, కార్యదర్శి చంద్రశేఖర్, కొండల్‌రెడ్డి, హైదరాబాద్ జిల్లా శాఖ కార్యదర్శి విక్రమ్‌కుమార్, కోశాధికారి బాల్‌రాజ్, అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులు ఉమర్ఖాన్, కురాడి శ్రీనివాస్, ఎస్ మురళీరాజ్, నరేశ్‌కుమార్, సంయుక్త కార్యదర్శులు ఖాలీద్ అహ్మద్, గీత, సుజాత, ప్రచార కార్యదర్శి వైదిక్ క్షత్ర, సభ్యులు ముఖిన్ ఖురేషి, శంకర్, తెలంగాణ నాలుగో తరగతి కేంద్ర సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి ఖాదర్‌బిన్ హతర్, నగర శాఖ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, శ్రీరామ్, టీఎనీవో జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, పీఆర్ఓ జహంగీర్ అలీ, ఏపీఆర్ఓ మహ్మద్ వహీద్ తదితరులు పాల్గొన్నారు.