ఏ తప్పూ చేయకున్నా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నాపై కేసు పెట్టారు. ఈ విషయం అందరికీ తెలుసు. నా విడుదల కోసం వేచి చూసిన తెలంగాణ సమాజానికి వినమ్రంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. అంతిమ విజయం సాధించే దాకా పోరాడతా. ప్రజాక్షేత్రంలో మరింత బలంగా పనిచేస్తా.
– కల్వకుంట్ల కవిత
MLC Kavitha | హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా తనపై ఉద్దేశపూర్వకంగా మోపిన కేసులో కడిగిన ముత్యంలా సంపూర్ణంగా బయటికి వస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉన్నదని, అంతిమ విజయం సాధించేవరకు అన్ని వేదికల మీద పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. బుధవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరే ముందు, హైదరాబాద్‌లోని ఇంటికి చేరుకొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నా రు. నిజం నిలకడగా తెలుస్తుందని చెప్పారు. కుటుంబానికి, సమాజానికి తనను ఎంతోకాలం దూరం చేయలేరని తేల్చిచెప్పారు. ఏ తప్పూ చేయకపోయినా రాజకీయ కక్షసాధింపులో భాగంగా తనపై కేసు నమోదు చేశారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిపోయిందని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో వెనడుగువేసే ప్రసక్తే లేదని తెలిపారు. తన విడుదల కోసం వేచిచూసిన తెలంగాణ సమాజానికి ఆమె వినమ్రంగా చేతులెత్తి మొక్కారు. అంతిమ విజయం సాధించే దాకా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. అనంతరం హైదరాబాద్‌లో తన ఇంటి వద్ద కూడా కవిత మాట్లాడారు. న్యాయం, ధర్మం గెలుస్తుందని అన్నారు. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అనేక పోరాటాల్లో పాల్గొంటానని తెలిపారు.
ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అపూర్వ స్వాగతం లభించింది. మంగళవారం జైలు నుంచి విడుదలైన కవిత బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కవిత వెంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సోదరుడు కేటీఆర్, భర్త అనిల్, కుమారుడు ఆదిత్య నగరానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, జాగృతి నాయకులు, మహిళా నాయకులు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, కుటుంబసభ్యులు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ రవీందర్రావు ఇతర ప్రముఖులు స్వాగతం పలికారు. జై తెలంగాణ, జై కవితక్క, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. చాలారోజుల తర్వాత ఆమెను చూసిన బీఆర్ఎస్ శ్రేణులు, జాగృతి నాయకులు, మహిళలు భావోద్వేగానికి గురయ్యారు. అభిమానులు పూలవర్షం కురిపించారు. వారికి పిడికిలెత్తి జై తెలంగాణ అంటూ కవిత అభివాదం చేశారు. వేల మంది వందల కార్లతో శంషాబాద్ నుంచి బంజారాహిల్స్ ఇంటికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ఆమె వెంటవచ్చిన వారిలో రాజ్యసభసభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సునీతాలక్ష్మారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాజీమంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శేరి సుభాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్‌గుప్తా, బాల్క సుమన్, పైలట్ రోహిత్‌రెడ్డి, కే వాసుదేవరెడ్డి తదితులు ఉన్నారు.
రాత్రి ఏడు గంటల సమయంలో కవిత ఇంటికి చేరుకున్నారు. ఆమెకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఘన స్వాగతం పలికారు. గులాబీ పూల వర్షం కురిపించారు. పార్టీ నాయకులు ఎదురుగా వెళ్లి స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చారు. లంబాడీ మహిళలు తమ సంప్రదాయ నృత్యాన్ని చేశారు. ఇంటి వద్ద కూడా కవిత జై తెలంగాణ అని నినదించారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కవితకు దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు. ఇంట్లోకి రాగానే పూజగదిలో దేవుడికి సాష్ఠాంగ నమస్కారం చేశారు. తల్లి శోభమ్మకు పాదాభివందనం చేశారు. ఆ సమయంలో ఇరువురు భావోద్వేగానికి గురయ్యారు. కవితను పరామర్శించడానికి కేటీఆర్ సతీమణి శైలిమ, హరీశ్‌రావు సతీమణి శ్రీనిత, ఇతర బంధువులు పెద్దఎత్తున తరలివచ్చారు.
హైదరాబాద్‌లో ఇంటికి చేరుకున్న అనంతరం తన అన్న కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టారు. రాఖీ పండుగ రోజున కవిత జైల్లో ఉండి రాఖీ కట్టలేకపోయారు. దీంతో ఇంటికి చేరుకోగానే రాఖీ కట్టి, స్వీట్ తినిపించారు. ఈ సందర్భంగా కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఆమెను కేటీఆర్ అలింగనం చేసుకొని ధైర్యం చెప్పారు. ఈ ఫొటోను కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ఇప్పుడు రాఖీపండుగకు సంపూర్ణత చేకూరింది’ అని పేర్కొన్నారు. కవితను ఇంటి వద్ద కలిసినవారిలో పార్టీ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, ముఠా గోపాల్, మాజీమంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పద్మా దేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దేవీప్రసాద్, చెరుకు సుధాకర్, గజ్జెల నగేశ్, పల్లె రవి, మన్నె గోవర్ధన్‌రెడ్డి, మేడే రాజీవ్‌సాగర్, భిక్షపతి, జాగృతి నాయకులు నవీన్ ఆచారి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, భారత జాగృతి నాయకులు ఉన్నారు. కవిత హైదరాబాద్ రాక సందర్భంగా ఫైటర్‌కు స్వాగతం అంటూ నగరం మొత్తం కవిత ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులను ఏర్పాటు చేశారు.