జగిత్యాల, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): నెహ్రూ కాలం నుంచి వాళ్ల కుటుంబానికి తెలంగాణతో అనుబంధం ఉన్నదని రాహుల్‌గాంధీ చెప్తున్నారని, తెలంగాణతో రాహుల్ గాంధీ కుటుంబానికి నమ్మక ద్రోహపు అనుబంధం ఉన్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. రాహుల్‌గాంధీ ముత్తాత నెహ్రూ తెలంగాణను ఆంధ్రాలో కలిపి ద్రోహం చేస్తే, రాహుల్‌గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన 369 మందిని తుపాకులతో కాల్చి చంపించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్‌గాంధీ తండ్రి రాజీవ్‌గాంధీ.. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో తెలంగాణ దళితబిడ్డ, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించారని అన్నారు. సీఎం కేసీఆర్ చావునోట్లో తల పెడితే 2009లో తెలంగాణ ఏర్పాటును ప్రకటించి.. మళ్లీ వెనకి తీసుకొని వందలాదిమంది బిడ్డల చావులకు సోనియాగాంధీ కారణమయ్యారని విమర్శించారు. ప్రజా పోరాటాలతోనే 2014లో తెలంగాణ వచ్చిందని చెప్పారు. కోరుట్లలో భారత జాగృతి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.
అనంతరం కోరుట్ల ఎమ్మె ల్యే విద్యాసాగర్‌రావు, బీఆర్ఎస్ కోరుట్ల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్లతో కలిసి మెట్పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 2009లో దీక్ష చేస్తే తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి.. మళ్లీ వెనకి తీసుకొని వందలాది బిడ్డల ప్రాణాలను తీసుకున్న ఇటలీ రాణి సోనియాగాంధీ బలిదేవత అని నిప్పులు చెరిగారు. అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నది సీఎం కేసీఆరేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. విజ్ఞత కలిగి, భవిష్యత్తుపై దృష్టి ఉండి, అభ్యున్నతి, సంక్షేమాన్ని నిరంతరం కాంక్షించే కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్లను, జగిత్యాల అభ్యర్థి డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.
నాకు గల్ఫ్ కార్మికులకు అనుబంధం ఎక్కువగా ఉంటది.. ఏ ఆపతి వచ్చినా నాకే డైరెక్ట్‌గా మెసేజ్ పెడ్తరు. అక్కా రేషన్‌కార్డులో మా పేరు తీయద్దంటే సీఎం దృష్టికి తీసుకుపోయి వారి పేర్లు ఉంచేలా చేసినం. మా ఆదాయంతో సంబంధం లేకుండా తల్లిదండ్రులకు పింఛన్ ఇయ్యాలంటే అలాగే చేసినం.
-ఎమ్మెల్సీ కవిత
బీసీలకు సీఎం కేసీఆర్ వ్యతిరేకమని రాహుల్ గాంధీ అంటున్నారని, ఆయన తెలివి ఉండి మాట్లాడుతున్నారో? తెలివి లేక మాట్లాడుతున్నారో? అర్థం కావడం లేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే సమగ్ర కుటుంబ సర్వే చేసి అన్ని కులాల వివరాలను సేకరించామని, సామాజిక స్థితిగతులు తెలుసుకొన్న తర్వాతనే ఇన్ని పథకాలకు రూపకల్పన చేసుకొన్నట్టు చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ హయాంలో కేవలం ఒకే ఒక బీసీ సంక్షేమ హాస్టల్ ఉండేదని, ఇప్పుడు ఉమ్మడిజిల్లా పరిధిలో 34 సంక్షేమ వసతిగృహాలు ఉన్నాయని తెలిపారు.
సింగరేణి, షుగర్ ఫ్యాక్టరీల గురించి మా ట్లాడే నైతికత కాంగ్రెస్, రాహుల్‌కు లేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సిర్పూర్లోని స్పిన్నింగ్ మిల్లును కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకటస్వామి జౌళి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ మూసివేసిందని అన్నా రు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మూసివేసింది కాంగ్స్రె అని చెప్పారు. తాడిచెర్ల బొ గ్గు గనిని ప్రైవేట్‌వాళ్లకు కాంగ్రెస్ పార్టీ అప్పగించిందని, సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఉంటే గోల్డెన్ హ్యాండ్ షేక్ అనే దిక్కుమాలిన పథకాన్ని పెట్టి అనేకమంది ఉద్యోగులకు వీఆర్ఎస్ తీసుకునేలా బలవంతం పెట్టింది కూడా కాంగ్రెస్సేనని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకొని, బొగ్గు గనులను మనకు ఇవ్వాలని కేంద్రంతో కొట్లాడి సాధించారని గుర్తు చేశారు. అనేక గనులు తెరిచి, డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని తెలిపారు. కాంగ్రెస్ డిస్మిస్ చేసిన 600 మంది సింగరేణి కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నది కేసీఆరేనని చెప్పారు. సింగరేణిని నిలబెట్టుకోవడమే కాకుండా ప్రతి ఏటా లాభాల్లో కార్మికులకు వాటాలను పంచుతున్నామని తెలిపారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ నష్టాల ఊబిలో మునిగిపోవడానికి కాంగ్రెస్ పార్టీ పట్టింపులేని తనమే కారణమని దుయ్యబట్టారు.
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి రాజకీయాల్లో సీనియార్టీ ఉంది.. కానీ ఆయనకు సిన్సియారిటీ లేదు. నన్ను క్వీన్ ఎలిజబెత్ రాణి అని పిలుస్తున్నారు.. నేనేమీ ఇటలీ రాణిలాగా తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలి తీసుకోలేదు. జీవన్‌రెడ్డి హోదాను మరిచిపోయి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మను అవమానించారు. గౌరమ్మకు బదులు ఇంకేదో పెట్టుకొని పండుగ చేసుకుంటామని మాట్లాడడం సమంజసమేనా? ఒక ఎన్నిక గెలువడానికి ఇంత దిగజారి మాట్లాడతారా? ఇవి కేవలం ఎన్నికలు మాత్రమే.. దిగజారి మాట్లాడొద్దు.. సంయమనంతో ఉండాలి.
-ఎమ్మెల్సీ కవిత
రాహుల్‌గాంధీ ఎలక్షన్ గాంధీ అని.. బబ్బర్ షేర్ కాదు.. పేపర్ టైగర్ అని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు విభజన హామీలు నెరవేర్చకుంటే రాహుల్‌గాంధీ తెలంగాణకు మద్దతుగా ఎందుకు నిలువలేదని ప్రశ్నించారు. పార్లమెంటులో సోనియాగాంధీ ఏపీకి రావాల్సిన హకుల గురించి మాట్లాడారే గానీ తెలంగాణ హకులపై మాత్రం మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి రాహుల్‌గాంధీ మనకు కావాలా? చావునోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించడంతోపాటు అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ కావాలా? అన్నది ప్రజలు ఆలోచించాలని కోరారు. రాహుల్‌గాంధీకి తెలంగాణపైన, ఇక్కడి ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులపైన అవగాహన లేదని, రాసిచ్చిన స్క్రిప్టు చదివి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ ముందుగా స్రిప్ట్ రైటర్‌ను మార్చుకోవాలని ఆమె సూచించారు.