BRS MLC Kavitha | హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): తమకు ఏ పార్టీతో జట్టులేదని, తెలంగాణ ప్రజలే తమ జట్టు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తమ పార్టీ సెంచరీ కొట్టడం ఖాయమని, 100కి పైగా సీట్లతో కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు కేవలం సర్వేల్లోనే గెలుస్తాయని, తాము ఎన్నికల్లో గెలుస్తామన్నారు. రాజకీయ కుట్రలో తాను పావును కాదని, ధైర్యంగా పోరాడే శక్తి తనకుందన్నారు. బీజేపీ బీసీ సీఎం జపం ఎన్నికల గిమ్మికేనని స్పష్టం చేశారు. శనివారం ట్విట్టర్ వేదిక ‘ఆస్క్ కవిత’ అనే కార్యక్రమం ద్వారా నెటిజన్ల ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు.
తెలంగాణ బీజేపీ నాయకత్వ బాధ్యతల నుంచి బీసీని తప్పించి అగ్రవర్ణాలకు అప్పగించిందని, కేంద్రంలోని బీజేపీ బీసీల కులగణనను చేపట్టడానికి నిరాకరిస్తుందని ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు కోటా ఇవ్వకుండా, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకుండా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా విస్మరించిందన్నారు. అన్నింటినీ పక్కనబెట్టి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ సీఎంను చేస్తామని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమకు రాజకీయ ప్రత్యర్థులతో ఎటువంటి డీల్ లేదని, తాము టీమ్ తెలంగాణ అని పునరుద్ఘాటించారు.
తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీకి 100కు పైగా సీట్లు వస్తాయని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ఆలోచనాపరులని, పదేళ్ల ప్రగతిని గమనించారన్నారు. బాధ్యత ఉన్న ప్రభుత్వాన్ని.. భరోసా ఇచ్చే నాయకుడిని మళ్లీ ఆశీర్వంచి మళ్లీ ఎన్నుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
తామే గెలస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సర్వేల్లో ఊదరగొడుతుందని, ఇదే ట్రిక్‌ను 2018లో ప్రయోగించిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడూ అదే ట్రిక్‌ను ప్లే చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా అప్పటిలాగే ఇప్పుడూ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని ఆమె స్పష్టం చేశారు.
మహిళా బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ప్రేక్షక పాత్రవహించిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఢిల్లీ మద్యం కేసులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తనపై నిరాధార తప్పుడు ఆరోపణలు చేయడంపై కవిత తీవ్రంగా స్పందించారు. ‘రాజకీయ కుట్రలో పావును కాను. ధైర్యంగా కొట్లాడే పటిమ నాకు ఉంది’ అని కవిత తేల్చిచెప్పారు.