హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో బీసీ సంఘాలు, జాగృతి నాయకులు ఆదివారం ఆమె నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ క్యాబినెట్ సబ్‌కమిటీకి అందజేసిన కులగణన సర్వేలోని వివరాలపై చర్చించారు. సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించిన గణాంకాలపై అధ్యయనం చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంలో ఎదురయ్యే ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై చర్చించారు.
దేశవ్యాప్తంగా జనగణనను ఎప్పుడు చేపడతారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనగణనను కేంద్రం విస్మరించిందని ఎక్స్ వేదికగా విమర్శించారు. జనాభా లెక్కలు లేకుండా ప్రగతి ఎలా సాధ్యం? దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితి ఎలా తెలుస్తుంది? అని నిలదీశారు.
జనగణన లేకుంటే వృద్ధికి ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రగతిశీల విధానాలకు జనాభా లెకలు తప్పనిసరి అని, జనగణనపై కేంద్రం తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.