హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి : ‘బీసీ బిల్లు ఆమోదానికి ఎంత ఆలస్యమైతే బీసీలకు అంత అన్యాయం జరుగుతుంది.. తమతో కలిసొచ్చే భావసారూప్యత ఉన్న పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.. ఐక్య ఉద్యమాలకు కలిసిరావాలి’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జూలై 17న నిర్వహించనున్న రైల్‌రోకోకు మద్దతును ఇవ్వాలని మంగళవారం ఆమె వామపక్ష పార్టీల నేతలను కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యాలయమైన ఎంబీ భవన్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో, అడిక్‌మెట్‌లోని న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యాలయమైన మార్స్ భవన్లో ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యులు సాధినేని వెంకటేశ్వరరావు, జేవీ చలపతిరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కే గోవర్దన్‌తో కవిత వేర్వేరుగా భేటీ అయ్యారు.
బీసీ రిజర్వేషన్ల పెంపు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు కోసం తెలంగా ణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏడాదిగా అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించామని వారికి కవిత వివరించారు. తమతోపాటు బీసీ సంఘాలు చేసిన ఆందోళనలకు దిగివచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్లో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఒక బిల్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు మరో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసిందని తెలిపారు. ఈ బిల్లులను కేంద్రానికి పంపి మూడు నెలలవుతున్నా, ఆమోదం కోసం కేంద్రంపై సీఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని విమర్శించారు. అందుకే జూలై 17న రైల్‌రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చామని, దీనికి మద్దతు ఇవ్వాల్సిందిగా కవిత కోరారు. ఢిల్లీకి వెళ్లిరావడంలో హాఫ్ సెంచరీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రధాని మోదీతో ఒకసారి కూడా బీసీ బిల్లుల ఆమోదం కోసం ఒత్తిడి తేలేదని ధ్వజమెత్తారు. కేంద్రం బీసీ బిల్లుకు ఆమోదముద్ర వేయాలంటే ఉద్యమబాట ఒకటే మార్గమని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, యూపీఎఫ్ కో-ఆర్డినేటర్ ఆలకుంట హరి, తెలంగాణ జాగృతి, యూపీఎఫ్, సీపీఎం, న్యూడెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు.
బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత చేపట్టిన ఉద్యమాలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ వెల్లడించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడం న్యాయమైన డిమాండ్ అని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం కోసం కవిత చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడిని పెంచేందుకు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత సీఎంపై ఉన్నదని చెప్పారు.
తమ పదువులను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌లోని కొందరు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివశంకర్ హితవు పలికారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చిత్తశుద్ధితో ఉద్యమిస్తున్న కవితపై ఆరోపణలు చేయడం కాదు.. పెంచిన రిజర్వేషన్లను అమలు చేయడానికి బాధ్యత తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు.