హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ‘పద్దెనిమిదేండ్లు నేను రాజకీయాల్లో ఉన్న.. ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన.. ఒక తల్లిగా ఐదున్నర నెలలు పిల్లలను, కుటుంబాన్ని వదిలి ఉండడమన్నది చాలా ఇబ్బందికర విషయం.. నన్ను నా కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసినవారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తం.. సమయం వస్తది.. తప్పకుండా చెల్లిస్తం’ అంటూ ఎమ్మెల్సీ కవిత ఉద్వేగానికి లోనయ్యారు. ‘నేను తెలంగాణ బిడ్డను. కేసీఆర్ బిడ్డను. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిన్రు’ అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఉగ్గబట్టుకొని మాట్లాడారు.
మంగళవారం తీహార్ జైలు నుంచి బయటికి వచ్చాక ఆమె తన కొడుకును ముద్దాడారు. భర్త అనిల్‌రావు, అన్న కేటీఆర్‌ను ఆలింగనం చేసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సహా కుటుంబసభ్యులను కలుసుకొని ఉద్విగ్నానికి లోనయ్యారు. అనంతరం ఆమె మీడియాతో కొంతసేపు మాట్లాడారు. తనను ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జైలుకు పంపారని నిప్పులు చెరిగారు. ‘జై తెలంగాణ..జై తెలంగాణ.. అందరికీ నమస్కారం. ఐదున్నర నెలల తర్వాత మీ అందర్నీ కలవటం చాలా సంతోషం. ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరుపేరునా నమస్కారాలు. ఇటువంటి కష్టసమయంలో నాకూ నా కుటుంబానికి తోడున్న వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నా’ అంటూ కంటతడి పెట్టుకున్నారు.
‘ఐదున్నర నెలల తరువాత నా కొడుకు, నా భర్త, నా అన్నతో కలిసే అవకాశం లభించింది. అందరికీ తెలుసు. రాజకీయ కక్షతోనే నన్ను జైల్లో పెట్టారు. ఇబ్బందేమీ లేదు. తప్పకుండా మేం పోరాటం చేస్తాం. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. నేను తెలంగాణ బిడ్డను. నేను కేసీఆర్ బిడ్డను. కేసీఆర్ బిడ్డగా నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. ప్రజాక్షేత్రంలో ఇంకా గట్టిగా పనిచేస్తం. కమిట్మెంట్తో పనిచేస్తం. అందరితో కలిసి పనిచేస్తం. న్యాయం కోసం పోరాటం చేస్తం. రాజకీయంగా యుద్ధమే చేస్తం. అకారణంగా.. అన్యాయంగా రాజకీయ కక్షసాధింపులో భాగంగా కేసీఆర్ బిడ్డను ఇబ్బంది పెట్టడం ద్వారా కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో జైలుకు పంపారు’ అని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.