హైదరాబాద్, అక్టోబర్ ౧౩ (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్ర కేసీఆర్ కూతురిని అయినందుకు గర్విస్తున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తాము బీజేపీ మాదిరిగా కాదని, సమర్థవంత వారసత్వ రాజకీయాలను గౌరవిస్తామని శుక్రవారం ఆమె ట్వీట్ (ఎక్స్) చేశారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై అడిగిన ప్రశ్నకు కవిత తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ట్వీట్‌కు జతచేశారు.
‘డీఎంకేతో, శివసేనతో పొత్తు పెట్టుకున్నప్పుడు మీకు వారసత్వ రాజకీయాలు గుర్తుకు రాలేదా? బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా దివంగత ఎన్టీఆర్ కూతురిని నియమించినప్పుడు మీకు వారసత్వ రాజకీయాలు గుర్తుకు రాలేదా?’ అని ప్రశ్నించారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉంటేనేమో వారసత్వ రాజకీయాలు సమర్థనీయం, బీజేపీకి లొంగకపోతే మాత్రం కుటుంబపార్టీలు అయిపోతాయా? అని నిలదీశారు. బీజేపీలో వారసత్వ రాజకీయాల నుంచి వచ్చినోళ్లు ఎంతోమంది ఉన్నారని, ఆ పార్టీ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని చురకలేశారు. అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు.
దక్షిణ భారతదేశంలో ఈసారి బీజేపీకి జీరో సీట్లు వస్తాయని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. దక్షిణ భారతదేశం సాధించిన ప్రగతిని (నంబర్లు), నిర్మించిన ప్రాజెక్టులను నమ్ముతుందని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ కవిత చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులో సైతం వైరల్ అవుతున్నాయి. ఆమెకు తమిళనాడు ప్రజలు మద్ద తు పలుకుతున్నారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దృష్టి మళ్లింపు రాజకీయాలు చేస్తున్నది. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వదు. గత పదేండ్లలో మోదీ ప్రభుత్వం రూ.౧౦౦ లక్షల కోట్ల అప్పు తెచ్చింది.
హామీలను అమలు చెయ్యడం లేదు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఎటువంటి ప్రాజెక్టులూ మంజూరు చేయడం లేదు’ అంటూ కవిత ధ్వజమెత్తారు. కవిత వ్యాఖ్యలను సమర్థిస్తూ తమిళ ప్రజలు పెద్ద ఎత్తున రీట్వీట్లు చేస్తున్నారు. వాస్తవాలు, గణాంకాలతో అన్నామలైకు గట్టిగా సమాధానం ఇచ్చారని కొనియాడుతున్నారు. కుటుంబపార్టీలు అంటూ విమర్శించే అర్హత బీజేపీకి లేదని స్పష్టంచేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ కవిత చేసిన వ్యాఖ్యలను ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్ సమర్థించారు. ట్విటర్ (ఎక్స్)లో కవిత మాట్లాడిన వీడియోను షేర్చేసిన ఆయన ‘కవిత మంచి క్లాస్ తీసుకున్నారు’ అంటూ క్యాప్షన్ జత చేశారు. పోలవరం తెలంగాణలో ఉన్నదంటూ అన్నామలై చేసిన వ్యాఖ్యలపై మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అన్నామలైకు కనీస పరిజ్ఞానంలేదని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.