ఖలీల్‌వాడీ, జూన్ 7: కేసీఆర్ అంటే కాలువలు, చెక్‌డ్యామ్‌లు, రిజర్వాయర్లు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి దుంకుతున్నయంటే దాని వెనుక సీఎం కేసీఆర్ శ్రమ ఎంతో ఉన్నదని తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో ఆమె మాట్లాడారు. పదేండ్లలో సాధించిన ప్రగతి సమీక్ష కోసమే దశాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో ఇరిగేషన్ రంగానికి ఆశించిన నిధులు కేటాయించలేదని, అదే కేసీఆర్ పాలనలో సాగునీటి కోసం పుష్కలంగా నిధులు ఇచ్చినట్టు తెలిపారు. సమైక్య పాలనలో అంతటా కరువు ఉండేదని, నేడు ఎక్కడ చూసినా పచ్చని పైర్లు కనిపిస్తున్నాయని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించామని, అందుకే నేడు పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉన్నదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కాలువలు తవ్వకుండానే వేల కోట్ల నిధులు దండుకున్నారని విమర్శించారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాగునీటి పరిస్థితులు చూసి కేసీఆర్ ఎంత బాధ పడేవారో ఒక బిడ్డగా తనకు తెలుసని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ రైతుల పట్ల ఉండేది తల్లి ప్రేమ అని, వారికి సాగునీటి కష్టాలు ఉండొద్దనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినట్టు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నిజంగా భగీరథ ప్రయత్నంగా అభివర్ణించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనేకంటే కాళేశ్వరం చంద్రశేఖర్‌రావుగా పిలవాలని సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు అని, ఇంతటి గొప్ప ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మె ల్యే బిగాల గణేశ్ గుప్తా, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ ఆకుల లలిత పాల్గొన్నారు.
‘కమలం పార్టీ నినాదాలకే పరిమితమైంది. డబ్బాలో రాళ్లు వేసి ఊపినట్టు జై జవాన్ – జై కిసాన్ అని ఒర్రుడే తప్ప వారి కోసం చేసిందేమీ లేదు. వాళ్లు ఒక్క అబద్ధం ప్రచారం చేస్తే మనం వంద నిజాలతో తిప్పికొట్టాలి’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఆధ్వర్యంలో 6, 22, 23, 24, 45వ డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం వినాయక్‌నగర్‌లోని విజయలక్ష్మి గార్డెన్లో జరిగింది. ఈ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కుటుంబం చాలా పెద్దదని.. ఆత్మీయ సమ్మేళనాలు ఇతర పార్టీల బహిరంగ సభల కన్నా గొప్పగా జరుగుతున్నాయని తెలిపారు. గులాబీ కండువా కప్పుకొన్నామంటే తెలంగాణ ప్రజలకు గులామ్లాగా పనిచేయాలని సూచించారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేయాలని, నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారంపై ఆలోచన చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గత ఐదేండ్లలో రాష్ట్రంలోని 65 లక్షల మంది రైతుల కోసం రూ.65 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. కేవలం నినాదాలకే పరిమితమైన పార్టీలను వదిలిపెట్టి అందరూ బీఆర్ఎస్లోకి వస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ మహాసముద్రమని.. నదులు, ఉపనదులు, పిల్లకాలువలు చివరికి వచ్చి సముద్రంలోనే కలుస్తాయని అన్నారు. సీఎం కేసీఆర్ ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా దాని వెనుక చాలా కసరత్తు చేస్తారని తెలిపారు.