MLC Kavitha | హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీని నిలువరించగల సత్తా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మాత్రమే ఉందని, భావసారూప్యత గల ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా తెలంగాణ మాడల్‌ను కోరుకుంటున్న ప్రజల ఎజెండాయే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా అని ఆమె స్పష్టంచేశారు. రాష్ట్రంలో బీజేపీ తమకు ప్రత్యర్థి, ప్రతిపక్షం రెండూ కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పెద్ద ప్రాంతీయ పార్టీగా మారిపోయిందని విమర్శించారు. సోమవారం ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బీజేపీ అడ్డంగా దొరికిపోయిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఇదేవిధానంలో 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టారని, తెలంగాణను 9వ రాష్ట్రంగా చేసుకోవాలనుకుంటే ఆ కుట్రను తాము అడ్డుకున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నలుగురు మంత్రులతోపాటు తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఐటీ, సీబీఐ దాడులు చేశారని గుర్తు చేశారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మోదీ వచ్చే ముందు ఈడీ వస్తుందనే విషయం దేశంలో చిన్న పిల్లలకు కూడా తెలిసిపోయిందని కవిత ఎద్దేవా చేశారు. తాము తప్పు చేయకపోయినా.. రాజ్యాంగబద్ధ సంస్థలను ప్రయోగించి బీజేపీ బెదిరించాలని చూస్తున్నదని, తప్పుచేయని తాము భయపడే ప్రసక్తేలేదని ఆమె తేల్చి చెప్పారు.
దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, అది ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా మారిపోయిందని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకే ఉందని స్పష్టం చేశారు. ‘దేశంలో ప్రాంతీయస్థాయిలోనే మతతత్వ శక్తులపై పోరాటం చేయగలుగుతాం. భారత్ జోడో యాత్ర తెలంగాణలో సాగుతున్న సమయంలో మునుగోడు ఉపఎన్నిక జరిగింది. అకడ కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. కానీ బీజేపీని మేము ఓడించి.. గెలిచాం. ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ కంటే కాంగ్రెస్ మెరుగైనదేమీ కాదు. కేవలం మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. రెండు మూడు రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో కలిసి అధికారాన్ని పంచుకొంటున్నది. అకడ కూడా చాలా తకువ సంఖ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు’ అని కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీయే ప్రత్యర్థి అని చెప్పుకోవడం వల్ల బీజేపీకే ప్రయోజనమని, రాహుల్ గాంధీయే తన ప్రత్యర్థిగా ఉండాలని మోదీ కోరుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్, డీఎంకే, బీజేడీ, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలను కలిపితే కాంగ్రెస్ కంటే ఎకువ సీట్లు ఉన్నాయని, దేశవ్యాప్తంగా దాదాపు 4 వేల ఎమ్మెల్యేలు ఉంటే అందులో కాంగ్రెస్‌కు కేవలం 695మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వివరించారు. దేశంలో బీజేపీని ఎదురొనే శక్తి కాంగ్రెస్‌కు లేదని, భావసారూప్యత కలిగిన పార్టీలతో బలమైన కూటమి ఏర్పాటు చేసి బీజేపీని ఎదుర్కోవాలనేదే బీఆర్ఎస్ అంతిమ లక్ష్యమని కవిత స్పష్టం చేశారు.
నిజామాబాద్‌లో అర్వింద్ ధర్మపురి పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్‌పై రాసిచ్చి.. గెలిచిన తర్వాత బోర్డు ఊసే ఎత్తడం లేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. పసుపు బోర్డు ఎందుకు తేలేదని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు. పసుపు బోర్డుపై చేతులెత్తేసి నాలుగేళ్లుగా టైంపాస్ చేస్తున్నారని, ప్రజలు ఎంపీ అర్వింద్‌పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని కవిత పేర్కొన్నారు. అర్వింద్ వాడుతున్న భాష కూడా సరిగ్గా లేదని, వ్యక్తిగతంగా తనను, సీఎం కేసీఆర్‌ను దూషించారని ఆమె గుర్తుచేశారు. తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా దేశానికి సేవ చేసేందుకు, తెలంగాణ మాడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చామని కవిత స్పష్టం చేశారు.
తెలంగాణలో బీజేపీకి క్షేత్రస్థాయిలో ప్రజాబలం లేదని, వచ్చే ఎన్నికల్లో ఈ విషయం రుజువు అవుతుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ‘దుబ్బాకలో కేవలం వెయ్యికి పైగా ఓట్లతో బీజేపీ గెలిచింది. నాగార్జునసాగర్, హుజూర్నగర్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ రెండు చోట్లా బీజేపీకి డిపాజిట్లు కూడా దకలేదు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ మా పార్టీని వీడి బీజేపీలో చేరారు. సొంత బలంపై రాజేందర్ గెలిచారు. అది బీజేపీ బలం కాదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సీఎంలు, కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేసినా బీఆర్ఎస్సే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకొన్నది’ అని ఆమె వివరించారు.
‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో ముందుకు సాగుతున్న బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా విశేషమైన ఆదరణ లభిస్తున్నదని, దేశంలో రాబోయేది కిసాన్ సర్కారేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్లో ఎలా చేరాలని మహారాష్ట్రకు చెందిన సాగర్ వర్దే అనే వ్యక్తి ఎమ్మెల్సీ కవితను ట్వీట్ ద్వారా అడిగారు. దీనిపై ఆమె స్పందించారు. దేశవ్యాప్తంగా జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో నేరుగా పాల్గొని సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆమె సూచించారు. బీఆర్ఎస్లో ఎలా చేరాలో తెలుపాలని తనకు ట్వీట్ పంపడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ మాదిరిగా దేశంలో కిసాన్ సరార్ ఏర్పడాలంటే కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని కవిత పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ విధానాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారనేందుకు మహారాష్ట్రకు చెందిన సాగర్ వర్దే లాంటి ఉత్సాహవంతులే ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇటీవల నాందేడ్‌లో నిర్వహించిన బహిరంగ సమావేశం మహారాష్ట్ర ప్రజానీకంపై గణనీయమైన ప్రభావం చూపిందని తెలిపారు.