Delhi liquor case | ఢిల్లీ మద్యం పాలసీ విధానంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను 2022 ఆగస్టు నుంచి టార్గెట్ చేశారు. అదే సంవత్సరం డిసెంబర్ 2న కవితను విచారిస్తామంటూ సీబీఐ నోటీసులు ఇచ్చింది. 2024 మార్చి 15న కవిత ఇంటికి వచ్చి కొన్ని గంటలపాటు విచారణ జరిపిన ఈడీ అధికారులు అదే రోజు రాత్రి ఆమెను అరెస్టు చేశారు. తేదీల వారీగా ఈ కేసులో ముఖ్య పరిణామాలు..
2022 ఆగస్టు 21: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను టార్గెట్ చేసిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఆ పార్టీ ఎంపీ పర్వేశ్వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సా ద్వారా బయటపెట్టించింది. ఆగస్టు 22న రాష్ట్ర బీజేపీ నాయకులు కవిత ఇంటిపై దాడికి తెగబడ్డారు.
2022 సెప్టెంబర్ 5: ఈ కేసులో కవిత బ్లాక్మనీ పెట్టుబడిగా పెట్టారని, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఈదీ, సీబీఐ అధికారులకు బక్క జడ్సన్ ఫిర్యాదు
2022 నవంబర్ 26: అభియోగపత్రంలో తొలిసారిగా ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించిన ఈడీ
2022 డిసెంబర్ 2: కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 కింది నోటీసులు ఇచ్చిన సీబీఐ.. డిసెంబర్ 6న విచారిస్తామని, ఢిల్లీ, హైదరాబాద్లోఎక్కడ సౌకర్యమో చెప్పాలని కోరింది.
2022 డిసెంబర్ 5: ఇతర కార్యక్రమాల వల్ల డిసెంబర్ 11, 12, 13, 14, తేదీల్లో అందుబాటులో ఉంటానని కవిత తెలిపారు. దీంతో సీబీఐ డిసెంబర్ 11న విచారణకు వస్తామని తెలపడంతో ఆమె వెల్కమ్ చెప్పారు.
2022 డిసెంబర్ 11: ఒక మహిళా అధికారితోపాటు 11 మంది అధికారులు కవిత ఇంటికి వచ్చారు. వారిలో ఐదుగురు సభ్యులతో కూడిన బృందం కవితను విచారించింది.
2023 మార్చి 8: ఎమ్మెల్సీ కవితకు నోటీసులిచ్చిన ఈడీ మార్చి 9న హాజరు కావాలని కోరింది. అందుకు కవిత మార్చి 11న హాజరవుతానని బదులిచ్చారు.
2023 మార్చి 11: తొలిసారిగా హైదరాబాద్లోని తన ఇంట్లో ఈడీ ముందు హాజరైన కవిత.. దాదాపు 9 గంటలపాటు విచారణను ఎదుర్కొన్నారు.
2023 మార్చి 15: ఈడీ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
2023 మార్చి 16: మొదటి విచారణ అనంతరం మార్చి 11న నోటీసులు ఇచ్చి.. రెండోసారి విచారణకు మార్చి 16న హాజరుకావాలని ఈడీ కోరింది. రెండో విచారణకు ఈడీ అడిగిన పత్రాలను న్యాయవాదితో కవిత పంపారు.
2023 మార్చి 20: మూడో విచారణకు 2023 మార్చి 20న ప్రత్యక్షంగా హాజరుకావాలని మార్చి 16న ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో కవిత ఈడీ ఎదుట హాజరై పదిన్నర గంటలపాటు విచారణ ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా తన ఎనిమిది ఫోన్లని ఈడీకి కవిత సమర్పించారు.
2023 మార్చి 20: ఈడీ విచారణ ఎదుర్కొన్న కవిత.. అదేరోజు నోటీసులు అందుకొని ఆ మరుసటి రోజు మార్చి 21న మరోమారు విచారణకు హాజరయ్యారు.
2023 మే 7: ‘ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అసలు కుంభకోణం ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? చెప్పండి. సాక్ష్యాధారాలతో దర్యాప్తు కొనసాగలేదు. రూ.వంద కోట్ల అక్రమాలంటూ.. రూ.లక్షల్లో నగదు చూపిస్తున్నారు. తగిన ఆధారాలు చూపించండి’ అంటూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈడీకి చురకలంటించింది.
2023 సెప్టెంబర్ 26: మద్యం పాలసీ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లను కవిత సవాల్ చేయగా 2023 సెప్టెంబర్ 26న సుప్రీంకోర్టు విచారణ చేపట్టి.. నవంబర్ 20 వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.
2024 ఫిబ్రవరి 21: మద్యం పాలసీ కేసులో ఫిబ్రవరి 26న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది.
2024 ఫిబ్రవరి 25: ఫిబ్రవరి 26న విచారణకు హాజరుకాలేనంటూ ఫిబ్రవరి 25న సీబీఐకి కవిత లేఖ రాశారు.
2024 మార్చి 15: విచారణ పేరుతో హైదరాబాద్లోని కవిత ఇంటికి మధ్యాహ్నం 1.45 గంటలకు వచ్చిన ఈడీ అధికారులు.. కొన్ని గంటలపాటు ఆమెను విచారించారు. రాత్రి 8.45 గంటలకు ఎలాంటి వారెంట్ లేకుండా అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు తరలించారు.
2024 మార్చి: తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున బెయిలివ్వాలని తొలిసారి కవిత బెయిల్ పిటిషన్ వేశారు.
2024 ఏప్రిల్ 11: ఇదే కేసులో తీహార్ జైళ్లో ఉన్న కవితను సీబీఐ అదుపులోకి తీసుకున్నది.
2024 జూలై 16: అస్వస్థతకు గురైన ఎమ్మెల్సీ కవిత
2024 జూలై: తనపై తప్పుడు అభియోగాలు మోపారని మళ్లీ ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన కవిత
2024 జూలై: ఈడీ, సీబీఐ కేసుల్లో ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం. ట్రయల్ కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకున్న కవిత
2024 ఆగస్టు 7: ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కవిత
2024 ఆగస్టు 20: కవిత బెయిల్ పిటిషన్పై మరోసారి వాదనలు జరిగాయి.
2024 ఆగస్టు 22: మరోసారి అస్వస్థతకు గురైన కవిత
2024 ఆగస్టు 27: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు