న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 26వ తేదీ వరకు కవితకు సమన్లు జారీ చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుండగా ఈడీ ఎదుట హాజరుకావాలంటూ తాజాగా నోటీసులు జారీ చేయడం అన్యాయమని ఎమ్మెల్సీ కవిత ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈడీ కార్యాలయంలో శుక్రవారం విచారణకు హాజరుకావాలని తాజాగా నోటీసులు జారీ చేశారని తెలిపారు. నళినీ చిదంబరం కేసులో వెలువరించిన ఉత్తర్వులనే తమకు కూడా వెలువరించాలని కవిత తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. దీనిపై ఈడీ వైఖరి ఏమిటో చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. పది రోజుల వరకు కేసు విచారణను వాయిదా వేసేందుకు తమకు అభ్యంతరం లేదని ఈడీ న్యాయవాది చెప్పారు. దీంతో పిటిషనర్ కవిత అభ్యర్థనకు అనుగుణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు పిటిషనర్ కవితకు సమన్లు జారీ చేయరాదని ఈడీని ఆదేశించింది. కవితను విచారణకు పిలవొద్దని స్పష్టంచేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన కేసులో ఈడీ ఇచ్చిన సమన్ల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.
అంతకుముందు కవిత తరపు సీనియర్ అడ్వకేట్ విక్రమ్దరి వాదనలు వినిపిస్తూ.. నళిని చిదంబరం కేసులో ఆమెను విచారణకు రావాలని ఈడీ పట్టుబట్టలేదని, అదే మాదిరిగా పిటిషనర్ కవిత విషయంలో కూడా చేయాలని కోరారు. మహిళలను విచారించేటప్పుడు క్రిమినల్ చట్టంలో అనేక వెసులుబాట్లు ఉన్నాయని గుర్తు చేశారు. చట్టబద్ధమైన పలు సడలింపులు మహిళల విచారణ విషయంలో ఉన్నప్పటికీ ఈడీ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నదని ఆరోపించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్-160 మహిళలకు వర్తిస్తుందో లేదో తేల్చాలని, మహిళలకు రక్షణ కల్పించే నిబంధనలను ఉల్లంఘించి ఈడీ చేసే విచారణను అడ్డుకోవాలని కోరారు. ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఏఎస్ జీ రాజు స్పందిస్తూ.. కవిత వేర్వేరు కార్యక్రమాలతో బిజీగా ఉంటే పది రోజులపాటు విచారణను వాయిదా వేసేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. ఈ దశలో కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్ దరి కల్పించుకుని, ఈడీ పది రోజులపాటు వాయిదా వేస్తామని చెప్తున్నందున అందుకు అనుగుణంగా ఈడీ సమస్ల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీంతో సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు పిటిషనర్ కవితను విచారణ చేయరాదని మధ్యంతర ఆదేశాలు జారీ చేయమంటారా? అని ఈడీని ప్రశ్నించింది. ఈడీ సమ్మతిని తెలియజేయడంతో ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.