హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి దుశ్చర్యలతో తెలంగాణ తల్లి కన్నీరు పెడుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారని, ఈ చర్య అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. కోట్లాది మంది బిడ్డల్లో స్ఫూర్తిని నింపిన తెలంగాణ తల్లిని మార్చడాన్ని ఖండిస్తున్నామని, ఈ కాంగ్రెస్ తల్లిని తాము తిరసరిస్తున్నామని ప్రకటించారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని రహదారిపై ఏర్పాటు చేసి, కాంగ్రెస్ రూపొందించిన తెలంగాణ తల్లిని చెరసాలలో బంధించినట్టు సచివాలయం లోపల ఏర్పాటు చేశారని ఆక్షేపించారు. సామాన్యులు ఎవరైనా తెలంగాణ తల్లికి పూలమాల వేయాలంటే సచివాలయంలోకి అనుమతే ఉండదని తెలిపారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారని విమర్శించారు.
‘పూలను పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమని, అలాంటి బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి మాయం చేయడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు. తెలంగాణతనం ఉట్టిపడేలా నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారని, తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మకు ప్రాధాన్యం ఇచ్చేలా తెలంగాణ తల్లిని తయారు చేయించారని తెలిపారు. గత 18 ఏండ్లలో ఎప్పుడూ, ఎవరూ కూడా తెలంగాణ తల్లి విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తన అకసుతో కాంగ్రెస్ తల్లిగా మార్చిందని ధ్వజమెత్తారు. ఉద్యమకారులపై నాడు తుపాకీని ఎకుపెట్టిన రేవంత్‌రెడ్డికి తెలంగాణ తల్లి పేరు పలికే అర్హతే లేదని కవిత స్పష్టంచేశారు. తెలంగాణ తల్లి స్వరూపాన్ని మార్చి ప్రజలను అవమానించిన సీఎం రేవంత్‌రెడ్డి గన్పార్ వద్ద ముకును నేలకు రాయాలని డిమాండ్ చేశారు.