హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): తప్పుడు వ్యాఖ్యానాలతో మహిళలను అవహేళన చేయడం మానుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీని హెచ్చరించారు. మహిళల వ్యక్తిత్వహననం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. మహిళలపై దాడి ఆపాలని సూచించారు. కాలం చెల్లిన మూసపద్ధతిలో మహిళలను అవహేళన చేయడం తగదని హితవు చెప్పారు. తెలంగాణ బీజేపీ చేసిన ట్వీట్‌పై ఆమె ఘాటుగా స్పందించారు.
మహిళలు ఉన్నత స్థానానికి చేరుకోవడాన్ని బీజేపీ ఓర్వలేక పోతున్నదా? అని ప్రశ్నించారు. మహిళా హకుల గురించి మాట్లాడుతున్న వారి గొంతు నొకడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు. ఇతరులపై నిందలు వేయడం మానుకొని పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.