స్టేషన్ ఘన్పూర్, ఏప్రిల్ 2: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలు ముందుగా భాష మార్చుకోవాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సూచించారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అన్ని రంగాల్లోనూ తెలంగాణ రోల్ మాడల్‌గా నిలుస్తున్నదని, ప్రతిపక్షాల వైఖరితో ఆశించినంత గౌరవాన్ని పొందలేక పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణకు వస్తున్న అవార్డులను బీజేపీ, కాంగ్రెస్‌లు జీర్ణించుకోవడం లేదని కడియం విమర్శించారు. ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్‌రెడ్డి సంస్కారం, సభ్యతను మరిచిపోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతలు మెరుగైన అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వానికి సూచనలివ్వడం, సమస్యలుంటే ఎత్తి చూపాలిగానీ వ్యక్తిగత దూషణలకు దిగకూడదని హితవు చెప్పారు.
ఇప్పటికైనా ఆయా పార్టీల నాయకులు వ్యవహార శైలి, భాష మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ నూతన సెక్రటేరియట్‌కు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం తాను దళితుడిగా గర్వపడుతున్నానని, దళితుల పక్షాన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ నెల 14న 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారని కడియం తెలిపారు.