జనగామ, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): వరంగల్‌లో ఈ నెల 15న నిరుద్యోగ మార్చ్‌ను నిర్వహించనున్నట్టు బీజేపీ ప్రకటించడం విడ్డూరం గా ఉన్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించా రు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందని, ఆ లెక్కన తొమ్మిదేండ్లలో మొత్తం 18 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేశారా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై వరంగల్ మార్చ్ లో మాట్లాడుతారా? ఏ ముఖం పెట్టుకొని నిరుద్యోగ మార్చ్ చేస్తరు? అని నిలదీశారు. జనగామ జిల్లాలోని లింగాలఘనపురం మండలం నెల్లుట్లలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది? అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. తెలంగాణలో తొమ్మిదేండ్లలో కేసీఆర్ సర్కారు లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని స్పష్టంచేశారు. 82 వేల ఖాళీలకు కొత్త నోటిఫికేషన్లు ఇచ్చిందని తెలిపారు. భర్తీ ప్రక్రియ సజావుగా జరిగితే తెలంగాణలో తమకు పుట్టగతులుండవని బీజేపీ నాయకులు లీకేజీల పర్వానికి తెరలేపారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో దేశంలోనే మొదటిస్థానం, విద్య, ఆరోగ్య రంగంలో మూడోస్థానం, అత్యధిక పంటల ఉత్పత్తిలో మూడోస్థానంలో ఉన్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇవన్నీ కాంగ్రెస్, బీజేపీ నాయకుల కండ్లకు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. తెలంగాణపై విషం కక్కారని మండిపడ్డారు. ‘భారత దేశంలో తెలంగాణ లేదా? అభివృద్ధి, సంక్షేమంలో మేం భాగస్వామ్యం కాదా? అభివృద్ధి జరిగితే సంతోషంతో కొత్త ప్రాజెక్టులు, నిధులతో ప్రోత్సహించాల్సింది పోయి అక్కసు వెళ్లగక్కుతావా? ఇదేనా మీ నీతి’ అని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.