హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సెక్యులర్ పార్టీనా? కాదా? అనేది రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ స్పష్టంచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలోని మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో మైనార్టీలకు వివిధ పథకాల్లో సబ్సిడీలు ఇవ్వగా, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒక రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో ఆదివారం పలువురు మైనార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించి మర్చిపోయారని, మైనార్టీల ఓట్లు వేసుకొని మోసం చేశారని మండిపడ్డారు. మైనార్టీల కోసం కేసీఆర్ గతంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, మైనార్టీ రెసిడెన్షియల్ సూల్స్ ఏర్పాటు చేశారని, డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చారని గుర్తుచేశారు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్న హామీని కాంగ్రెస్ అమలుచేయడం లేదని విమర్శించారు. మైనార్టీ విద్యార్థులకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరుతో ఇస్తామన్న ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని విమర్శించారు. మోదీని రేవంత్‌రెడ్డి బడే భాయ్ అంటారని, ఆరెస్సెస్‌లో పనిచేశారని, తెలంగాణలో గుజరాత్ మాడల్ అమలుచేస్తామని అంటున్నారని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీ, అమిత్‌షాను ఫాలో అవుతున్నారని మండిపడ్డారు.
ఉర్దూ డీఎస్సీ ఏమైంది?
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఉర్దూ డీఎస్సీ హామీ ఏమైందని మహమూద్ అలీ నిలదీశారు. కేసీఆర్ ఉర్దూను తెలంగాణ రెండో అధికార భాషగా ప్రకటించారని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో పాతబస్తీ అభివృద్ధి జరిగిందని, రోడ్లు, ఫె్లైఓవర్లు నిర్మాణమయ్యాయని గుర్తుచేశారు. మలక్‌పేటలో ఐటీపార్ను కేటీఆర్ ఏర్పాటుచేశారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముస్లిం, మైనార్టీలపై దాడులు పెరిగాయని విమర్శించారు. రైతులు, ప్రజలు పరేషాన్లో ఉన్నారని ఆందోళన వ్యక్తంచేశారు. హైడ్రా, మూసీ కూల్చివేతలతో పాతబస్తీ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఫైరయ్యారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అక్బర్ హుస్సేన్, పార్టీ నాయకులు బద్రుద్దీన్, కలీమ్, మునీర్, యూసఫ్ పాల్గొన్నారు.